హంతకులను, గుండాలను.. ప్రోత్సహిస్తోన్న బీజేపీ, బీఆర్ఎస్

  • గంజాయి, గుండాయిజం కట్టడి చేస్తున్నందుకు నా ఇంటిపై దాడి 
  • మీడియా సమావేశంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

మంచిర్యాల, వెలుగు:  నా ఇంటిపై దాడి చేసినంత మాత్రాన భయపడేది లేదని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు స్పష్టంచేశారు. బీజేపీ, బీఆర్ఎస్​ లీడర్లు హంతకులను, గుండాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. శుక్రవారం తన ఇంట్లో  మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 14న రాత్రి ఇంట్లోకి  ముసుగులతో ముగ్గురు దుండగులు చొరబడి వాచ్ మన్ ను కొట్టారన్నారు. తనను భయపెట్టడానికి దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మంచిర్యాలలో గంజాయి, గుండాయిజాన్ని నిర్మూలించడానికి తను ప్రయత్నించడం అక్రమార్కులకు నచ్చడం లేదన్నారు. 

గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, ఆయన కొడుకు విజిత్ రావు అండతో చెలరేగిపోయిన వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారన్నారు. గతంలో విజిత్ రావు సపోర్ట్ తో మంచిర్యాలకు గంజాయి వచ్చిందని, యువకుల జీవితాలను నాశనం చేశారని ఆరోపించారు. తన హయాంలో సామాన్యులకు ఎలాంటి అన్యాయం జరగదన్నారు. నియోజకవర్గంలో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి రూ.15 కోట్లు మంజూరు అయ్యాయన్నారు. ఐబీలో సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్, ఎంసీహెచ్​ నిర్మాణంలో విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.