శాంతియుతంగా శోభాయాత్ర జరుపుకోవాలి

నిర్మల్/ఆదిలాబాద్​టౌన్/బెల్లంపల్లి, వెలుగు: నిర్మల్ పట్టణంలో వినాయక నిమజ్జన శోభా యాత్ర శాంతియుతంగా జరుపుకుందామని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోరారు. స్థానిక రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గణేశ్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. శోభాయాత్రకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయని, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 

సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, డీఎస్పీ గంగారెడ్డి, గణేశ్ ఉత్సవ కమిటీ బాధ్యులు అయ్యన్న గారి భూమయ్య, పతికే రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని వినాయకులను నిమజ్జనం చేసే బంగల్​పేట్ చెరువును మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్,  మున్సిపల్ అధికారులతో కలిసి మహేశ్వర్ రెడ్డి సందర్శించారు. నిమజ్జనం ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ సందర్భంగా నిర్మల్ ప్రెస్ క్లబ్​లో ఏర్పాటు చేసిన వినాయకుడికి మహేశ్వర్ రెడ్డి పూజలు చేశారు. 

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

ఆదిలాబాద్ ​జిల్లా కేంద్రంలో నిర్వహించే వినాయక నిమజ్జనోత్సవాలు పెద్ద ఎత్తున జరగనున్న నేపథ్యంలో అధికారులు, పోలీసులు అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలం సూచించారు. పట్టణంలో నిమజ్జన శోభాయాత్ర నిర్వహించే దారులు, నిమజ్జనం చేసే చెరువులను పరిశీలించారు. 

చెరువు వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ట్రైనీ కలెక్టర్ అభిజ్ఞాన్, డీఎస్పీ జీవన్ రెడ్డి, పలు శాఖల అధికారలు పాల్గొన్నారు. నిమజ్జన వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ కోరారు. 

పట్టణంలోని శంషీర్ నగర్ బస్తీలో ఎస్ఎస్ఎన్ యూత్ వినాయక మండలి నిర్వహించిన అన్నదానం కార్యక్రమానికి చీఫ్​గెస్ట్​గా హాజరై ప్రారంభించారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.