బర్డ్స్.. భలే.. కవ్వాల్​ టైగర్ జోన్​లో బర్డ్​ వాక్ ​ఫెస్టివల్..

జన్నారం రూరల్, వెలుగు : జాతీయ పక్షుల దినోత్సవం సందర్భంగా కవ్వాల్​ టైగర్ జోన్​లోని ఇందన్​పల్లి రేంజ్​ పరిధి గనిశెట్టికుంట, మైసమ్మకుంట ఏరియాల్లో రెండు రోజులు నిర్వహించి న బర్డ్​ వాక్ ​ఫెస్టివల్​ ఆదివారం ముగిసింది. భారీగా తరలివచ్చి బర్డ్స్ లవర్స్ శనివారం సాయంత్రం పక్షులను తిలకించారు. రాత్రి అక్కడే క్యాంప్ ఫైర్ వద్ద బస చేసి ఆదివారం ఉదయం మళ్లీ బర్డ్​ వాక్​ కు వెళ్లారు.

ఉడ్​పికర్, కింగ్​ఫిషర్, బ్లాక్ హెడ్ ఈగల్, అడవి బాతులు, అడవి కోళ్లు, చిలుకలు, ఫిషింగ్ ఈగల్స్, కార్న్ హెరాల్డ్, పారాకిట్, మునియా, కొర్మోన్ట్ వంటి అరుదైన పక్షులను చూసి  పరవశించిపోయారు. తమ సెల్ ఫోన్లలో,  కెమెరాల్లో బంధించారు. బర్డ్​ వాక్​ ఫెస్టివల్​ మరపురాని అనుభూతిని మిగిల్చిందని పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. పర్యాటకులకు జన్నారం, ఇందన్​పల్లి రేంజ్ ​ఆఫీసర్లు సుష్మారావు, శ్రీనివాస్ ​ఏర్పాట్లను చేశారు.