Gautam Adani: బిలియనీర్ గౌతమ్ అదానీకి అరెస్ట్ వారెంట్

బిలియనీర్, అదానీ గ్రూప్ చైర్మన్, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన  గౌతమ్‌ అదానీకి బిగ్ షాక్..అదానీ సోలార్ ప్రాజెక్టు విషయంలో లంచం, మోసం కేసులో అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీ పాత్రపై అమెరికాలో అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అదానీ సోలార్ ప్రాజెక్టు కాంట్రాక్టుల కోసం లంచం ఇచ్చి లబ్ది పొందే మోసానికి పాల్పడిన విషయంలో కేసు నమోదు ఫైల్ చేశారు. ఈ కేసులో అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీతో సహా ఏడుగురు వ్యక్తులు నిందితులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 

అదానీ,అతని మేనల్లుడు సాగర్ అదానీతో సహా మరో ఏడుగురు నిందితులు 20 ఏళ్లలో.. 2 బిలియన్ డాలర్ల లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు $265 మిలియన్ డాలర్ల లంచాలు చెల్లించేందుకు అంగీకరించారని అధికారులు తెలిపారు.ఈ కేసులో యూఎస్ లంచం నిరోధక చట్టం ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ను ఉల్లంఘించినట్లు వెల్లడించారు. 

అదానీ, మరో ఎగ్జిక్యూటివ్ వినీత్ జైన్ లు అవినీతిని దాచిపెట్టి ఇన్వెస్టర్లు, రుణదాతల నుంచి 3 బిలియన్ డాలర్ల రుణాలు, బాండ్లను సేకరించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే అదానీకీ అరెస్ట్ వారెంట్ పై అదానీ గ్రూప్ సంస్థ నుంచి ఎలాంటి స్పందన లేదు. వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయం నుంచి ఎటువంటి సమాచారం లేదు.