సిద్దిపేట, వెలుగు: ట్రబుల్షూటర్ గా పేరొందిన మాజీ మంత్రి హరీశ్ రావు వ్యూహాలు గురి తప్పాయి. సిద్దిపేట జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ కు భారీ మెజారిటీ సాధించి మెదక్ ఎంపీ సీటును సునాయాసంగా గెలుచుకోవాలని ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అభ్యర్థిని ప్రకటించిన నాటి నుంచి పోలింగ్ జరిగే వరకు అన్ని బాధ్యతలను మోస్తూ.. అసెంబ్లీ ఫలితాలతో నిరాశలో ఉన్న పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసినా ఆశించిన ఫలితాలను ఆయన సాధించకలేకపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మూడు సెగ్మెంట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులకు 1.81 లక్షల మెజారిటీ రాగా.. లోక్ సభ ఎన్నికల్లో అది 47,200కు పడిపోయింది. లోక్ సభ ఎన్నికల్లో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాకలోనూ ఆశించిన ఓట్లు రాకపోవడంతో పార్టీ శ్రేణులు నిరాశా నిస్పృహలో మునిగిపోయారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామ రెడ్డికి దుబ్బాక లో 15,901, గజ్వేల్ లో 28,621 గౌరవప్రదమైన మెజారిటీ లభించగా సిద్దిపేటలో మాత్రం అనూహ్యంగా 2,678 ఓట్ల మెజారిటీయే వచ్చింది. ఈ ఎన్నికల్లో ట్రబుల్ షూటర్ వ్యూహాలను సిద్దిపేట ఓటర్లు తిప్పికొట్టారన్నది తేలింది.
పోల్ మేనేజ్‌మెంట్‌తోనే పెరిగిన ఓట్లు
ఎన్నికల ప్రచారాలు ముగిసిన తరువాత బీఆర్ఎస్ చేసిన పోల్ మేనేజ్మెంట్ తోనే కొంతమేర ఓటింగ్ పెరిగింది. బీజేపీ వైపు మొగ్గు చూపే వర్గాలతో హరీశ్ రావు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. రూరల్ ఏరియాల్లో సైతం బీజేపీ వైపు మొగ్గు చూపకుండా తనదైన రీతిలో ప్రయత్నాలు చేశారు. ఎన్ని చేసినా మూడు సెగ్మెంట్లలో బీఆర్ఎస్ కు కొంత మెజారిటీ దక్కినా ఓటర్లు బీజెపీ వైపు మొగ్గు చూపకుండా ఆపలేకపోయారు.
సిద్దిపేటలో భారీగా పడిపోయిన మెజారిటీ
రెండు దశాబ్దాలుగా సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ ఈ నియోజకవర్గాన్ని తన అడ్డాగా మార్చుకున్న హరీశ్ రావుకు ఇక్కడి ఓటర్లు లోక్ సభ ఎన్నికల్లో షాకిచ్చారు. సిద్దిపేట సెగ్మెంట్ లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామ రెడ్డికి కనీసం 50 వేల మెజారిటీ వస్తుందని భావించగా 2,678 ఓట్ల మెజారిటీ మాత్రమే దక్కడం చర్చనీయాంశంగా మారింది.