గులాబీ కంచుకోటలో బీఆర్ఎస్కు బిగ్ షాక్

  • మెదక్​ పార్లమెంట్​ స్థానంలో డబుల్​ హ్యాట్రిక్​కు​ బ్రేక్​
  • అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి అండగా నిలిచిన ఓటర్లు
  • మొన్నటి ఎన్నికల్లో ఆరు నియోజకవర్గాల్లో  గెలుపు 
  • ఆరు నెలల్లోనే అనూహ్య మార్పు
  • లోక్ సభ ఎన్నికల్లో  అన్ని సెగ్మెంట్లలో భారీగా తగ్గిన ఓట్లు 

మెదక్​, వెలుగు : గులాబీ కంచుకోటగా పేరున్న మెదక్ లోక్​సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ​పార్టీకి ఊహించని షాక్​ తగిలింది. వరుసగా ఆరోసారి లోక్​సభ ఎన్నికల్లో గెలుపొంది డబుల్ ​హ్యాట్రిక్​ కొట్టాలని ఆశించిన ఆ పార్టీకి ఓటర్లు ఝలక్​ఇచ్చారు. రాష్ట్రంలో మిగతా చోట్ల పరిస్థితి ఎలా ఉన్నా మెదక్​లో మాత్రం కచ్చితంగా గెలుస్తామన్న ధీమాలో ఆ పార్టీ హైకమాండ్​ ఉండగా ఓటమి చవిచూడడమే కాక మూడో స్థానానికి పరిమితమైంది. ఆరు నెలల కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 
బీఆర్ఎస్​ పార్టీని ఆదరించి ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలను గెలిపించిన ఓటర్లు లోక్​సభ ఎన్నికల్లో మాత్రం వ్యతిరేక తీర్పునిచ్చారు.  

ఏడింటికి ఆరు కైవసం

2023 నవంబర్​లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. మెదక్ లోక్​సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో  ఆరు చోట్ల బీఆర్ఎస్​ అభ్యర్థులు గెలిచారు. సంగారెడ్డి, పటాన్​చెరు, నర్సాపూర్​, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్​ అభ్యర్థులు విజయం సాధించగా, ఒక్క మెదక్ అసెంబ్లీ స్థానంలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి గెలిచాడు. ఇక్కడ బీఆర్ఎస్​ అభ్యర్థి రెండో స్థానంలో నిలిచారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో లోక్​సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కలిపి బీఆర్ఎస్​కు 6,68,955 ఓట్లు రాగా, రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ పార్టీకి 4,20,881, బీజేపీకి 2,11,626 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్​పై బీఆర్ఎస్​2,48,074  ఓట్ల మెజారిటీ సాధించింది. ఆరు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు ఉండడం, అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు రెండున్నర లక్షల ఓట్ల ఆధిక్యత లభించడంతో లోక్​ సభ ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద నడకే అన్న ధీమాలో బీఆర్ఎస్​ ఉండింది.

  అయితే, ఆ పార్టీ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీని ఆదరించి కారు గుర్తు మీట నొక్కిన ఓటర్లు పార్లమెంట్​ ఎన్నికలకు వచ్చేసరికి కమలం పార్టీకి జై కొట్టి బీఆర్ఎస్​కు ఊహించని షాక్​ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు 6,68, 955 ఓట్లు రాగా లోక్​ సభ ఎన్నికల్లో 3,95,250  ఓట్లు మాత్రమే వచ్చి మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.  ఊహించని విధంగా అప్పటి కంటే 2,73,705  ఓట్లు తగ్గాయి. అగ్రనేతల సెగ్మెంట్లలోనూ భారీగా తగ్గిన ఓట్లు

ఈ పార్లమెంట్​ఎన్నికల్లో బీఆర్ఎస్​ పార్టీ 

అగ్రనేతల నియోజకవర్గాల్లోనూ భారీగా ఓట్లు తగ్గాయి. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ సెగ్మెంట్​లో అసెంబ్లీ ఎన్నికల కంటే ఇప్పుడు 26,252 ఓట్లు తగ్గగా, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రాతినిథ్యం వహించే సిద్దిపేట సెగ్మెంట్​లో 40,013, సంగారెడ్డి సెగ్మెంట్​లో 55,238, పటాన్​చెరు సెగ్మెంట్​లో 50,806 , నర్సాపూర్​ సెగ్మెంట్​ లో 34,038 , మెదక్ నియోజకవర్గంలో 36,493 , దుబ్బాక సెగ్మెంట్​లో  31,165 ఓట్లు తగ్గాయి.