చెత్త సంచులు కాదు గంజాయి బ్యాగులు.. పుష్ప సినిమాకు మించి ట్విస్టులు..!

  • ఆదిలాబాద్ జిల్లాలో అంతరాష్ట్ర గంజాయి ముఠా సభ్యుల అరెస్ట్
  • 292 ప్యాకెట్లలోని దాదాపు 900 కిలోల, రూ 2.25 కోట్ల విలువ గల గంజాయి స్వాధీనం
  • 8 మందిపై కేసు నమోదు, ఇద్దరు అరెస్ట్.. గంజాయి కంటైనర్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం
  • చాకచక్యంగా గంజాయి ముఠా సభ్యులను అరెస్టు చేసిన ఆదిలాబాద్ జిల్లా పోలీసులు
  • ఆంధ్రా-ఒడిశా సరిహద్దు నుంచి మహారాష్ట్రలోని బుల్దాన, దూలే జిల్లాలకు గంజాయి తరలింపు

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని అటవీ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున గంజాయిని దేశంలోని వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను తలమడుగు మండలం లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ వద్ద ఆదిలాబాద్ రూరల్ సర్కిల్ పోలీసుల బుధవారం(సెప్టెంబర్ 25, 2024) అరెస్ట్ చేశారు. 292 ప్యాకెట్లలోని దాదాపు 900 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 

ఈ గంజాయి విలువ రూ 2.25 కోట్లు ఉండొచ్చని పోలీసులు తెలిపారు. 8 మందిపై కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. గంజాయి కంటైనర్, రెండు సెల్ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి ముఠా గురించి ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ మీడియాకు వివరాలను వెల్లడించారు. పెద్ద ఎత్తున గంజాయి తరలిపోతుందనే పక్కా సమాచారంతో బుధవారం ఉదయం వాహనాలను తనిఖీ చేశామని ఆయన చెప్పారు. 

ALSO READ | భైంసాలో మరో చైన్​ స్నాచింగ్

ఆదిలాబాద్ ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్కు చెందిన ఒక ఐచర్ కంటైనర్ వాహనం నంబర్ UK08CB5318 ఆదిలాబాద్ పట్టణం వైపు నుంచి మహారాష్ట్ర వైపు వెళుతోంది. పోలీసుల ఆ వాహనాన్ని చెక్ పోస్ట్ వద్ద ఆపి తనిఖీ చేశారు. ఆ వెహికల్లో డ్రైవర్, క్లీనర్లు ఉన్నారు. పోలీసులు డ్రైవర్ వసీమ్ను విచారించగా ఉత్తరాఖండ్లోని హరిద్వార్కు చెందిన అన్షు జైన్, యూపీకి చెందిన పండిత్ జి, సోను అన్సారి.. వీళ్లంతా ఫ్రెండ్స్. 

గత మూడు సంవత్సరాలుగా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి వ్యాపారం చేస్తున్నారు. ఛత్తీస్గడ్లోని రాయపూర్, సుక్మా, జగదల్పూర్ జిల్లాల అటవీ ప్రాంతం నుంచి చాలాసార్లు తన వాహనంలో గంజాయిని తీసుకువచ్చి ఈ ముగ్గురికీ డ్రైవర్ వసీమ్ డెలివరీ చేసేవాడు. గంజాయి డెలివరీ చేసినందుకు డ్రైవర్ వసీంకు పెద్ద ఎత్తున డబ్బులు ముట్టజెప్పేవారు. 

ఆంధ్రా--ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో 900 కిలోల గంజాయి ఉందని, మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాకు చెందిన ఒక పార్టీకి మరియు మాలే జిల్లాకు చెందిన ఒక పార్టీకి అవసరం ఉందని గంజాయి ముఠా డ్రైవర్ వసీంకు సమాచారం ఇచ్చింది. డెలివరీ చేస్తే లక్షన్నర ఇస్తాం అనడంతో వసీం ఒప్పుకున్నాడు. 

భద్రాచలం, మారేడుపల్లి, చింతూరు మీదుగా ఆశిష్ చెప్పిన అటవీ ప్రాంతం ఆంధ్రా ఒడిశా బోర్డర్కు వశీం వెళ్లాడు. అక్కడ ఆశిష్ మనుషులు గంజాయి నింపిన 36 బ్యాగులను వసీంకు చూపించి కంటైనర్లోకి చేర్చారు. ఆశిష్ చెప్పిన కంటైనర్ వాహనం ముందు పైలెట్ వాహనంగా గంజాయి ఇవ్వాల్సిన పార్టీకి చెందిన ఒక వ్యక్తి కారులో వెళ్లాడు. ఏదైనా సమస్య ఉంటే అతను చూసుకుంటాడని వశీంకు ఈ గంజాయి ముఠా చెప్పింది. వసీం గంజాయి నింపుకుని వరంగల్, కరీంనగర్ మీదుగా పైలెట్ వాహనం వచ్చిన రూట్లో వస్తూ ఉండగా మహారాష్ట్రలోని బుల్దానాకు వెళుతున్నప్పుడు ఆదిలాబాద్ రూరల్ సర్కిల్ పోలీసులు అరెస్ట్ చేశారు.