కేసు దర్యాప్తులో అవకతవకలకు పాల్పడిన.. ఎస్ఐ సస్పెండ్

కేసు దర్యాప్తులో అవకతవకలకు పాల్పడినట్లు తేలడంతో సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని భూంపల్లి ఎస్ఐ వి రవికాంత్ సస్పెండ్ అయ్యారు. మామిడి తోటలో జరిగిన దొంగతనం కేసు దర్యాప్తులో అవకతవకలకు పాల్పడటంతో పాటు, భూ తగాదా కేసుల్లో బాధితులకు కాకుండా వారి ప్రత్యర్థులకు సహకారం అందిస్తునట్లు ఆరోపణల నేపథ్యంలో మే 24వ తేదీ శుక్రవారం ఎస్ఐ విరవికాంత్ ని మల్టీ జోన్ 1 ఐజీపీ ఏవీ రంగనాథ్ సస్పెండ్ చేశారు.

వివరాల్లోకి వెళితే..  ఎస్ఐ రవికాంత్ గతంలో మెదక్ జిల్లా శివం పేట్ ఎస్ఐగా విధులు నిర్వహించే సమయంలో మామిడి తోటలో యాభై టన్నులకు పైగా మామిడి పండ్లు చోరికి గురైనట్లుగా బాధిత యజమాని ఫిర్యాదు ఇచ్చాడు. అయితే, ఫిర్యాదుపై సరైన విధంగా స్పందించకుండా ఎస్ఐ అలసత్వంతో వ్యవహరించాడు. ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన ఎస్ఐ.. నామమాత్రంగా విచారణ చేపట్టాడు. 

కొద్ది రోజుల అనంతరం సివిల్ కేసు పరిధిలోకి వస్తుందని పోలీస్ ఉన్నత అధికారులను తప్పు దోవ పట్టిస్తూ.. దొంగతనం కేసు ను సివిల్ తగాదా కేసుగా ముగించేందుకు ఎస్ఐ రవికాంత్ అవకతవకలకు పాల్పడ్డాడు. దీంతోపాటు భూ తగాదా కేసుల్లో బాధితులకు కాకుండా వారి ప్రత్యర్థులకు సహకారం అందిస్తున్నట్లుగా ఆరోపణలు రావడంతో మెదక్ ఎస్పీ విచారణ చేపట్టారు. ఆరోపణలు నిజమేనని తేలడంతో ఎస్ఐ రవికాంత్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీనీ ఏవీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.