బీజేపీ పెద్దలు చెప్తేనే కేసీఆర్ ​అసెంబ్లీకి వచ్చిండు!: భట్టి విక్రమార్క

  • బడ్జెట్ ప్రసంగం పూర్తిగా వినకుండానే విమర్శలా: భట్టి

హైదరాబాద్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ లీడర్లు చెప్పడం వల్లే  కేసీఆర్ గురువారం హడావుడిగా అసెంబ్లీకి వచ్చారని, కనీసం బడ్జెట్​ప్రసంగం పూర్తయ్యేదాకా ఉండకుండా మధ్యలో వెళ్లి మీడియా పాయింట్​వద్ద ప్రెస్​మీట్​పెట్టి బడ్జెట్​పై విమర్శలు చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆరోపించారు. మధ్యలో లేచివెళ్లిన ఆయనకు బడ్జెట్​గురించి ఏం తెలుస్తుందని,  బడ్జెట్ ప్రసంగం పూర్తిగా వింటే  ప్రభుత్వం ఏం చేస్తుందో కేసీఆర్ కు అర్థమయ్యేదన్నారు. కేంద్రం నుంచి హక్కుగా రావాల్సిన నిధుల కోసం బుధవారం అసెంబ్లీలో పెట్టిన చర్చకు కూడా కేసీఆర్ అంతే హడావుడిగా వస్తే  బాగుండేదన్నారు.

గురువారం అసెంబ్లీలో బడ్జెట్ పెట్టిన తర్వాత భట్టి..మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి అక్కడే మీడియాతో చిట్ చాట్ చేశారు. ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇచ్చానని, ఇక ఈ బడ్జెట్ పై చీల్చి చెండాడుతానని కేసీఆర్ చేసిన కామెంట్స్​పై భట్టి తీవ్రంగా స్పందించారు. ‘ఆయన మాకు సమయం ఇవ్వడం ఏమిటి? తెలంగాణ ప్రజలే కేసీఆర్ కు రెస్ట్​ ఇచ్చారు. అసెంబ్లీలో బుధవారం మా వాళ్లను కాంగ్రెస్ వాళ్లు తిట్టారని, నువ్వు వెళ్లి కాంగ్రెస్ వాళ్లను తిట్టిరా..” అని ఢిల్లీ నుంచి బీజేపీ నేతలు చెప్పడంతోనే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారని భట్టి ఆరోపించారు. ఈ బడ్జెట్​లో పెట్టిన ప్రతి అంశాన్ని అమలు చేసి తీరుతామని, వీటిని అమలు చేసేందుకు ఎలాంటి అదనపు పన్నులను ప్రజలపై విధించబోమని భట్టి స్పష్టం చేశారు. పథకాల అమలు కోసం నిధుల సమీకరణ ఎలా చేయాలో..అలా చేసి తీరుతామని, ఎక్కడి నుంచి సమీకరిస్తానేది మాత్రం తమను అడగవద్దన్నారు.

కేసీఆర్​ను చూసి నవ్వాలో ఏడ్వాలో తెలియట్లేదు

సీఎంతో కలిసి ప్రతి వారం రెవెన్యూ వచ్చే శాఖలపై రివ్యూ చేస్తున్నామని భట్టి చెప్పారు. దేశ చరిత్రలోనే వ్యవసాయ రంగానికి 25 శాతం నిధులను బడ్జెట్ లో కేటాయించిన రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనన్నారు. గత సంవత్సరం రాష్ట్ర బడ్జెట్​లో రూ.17,700 కోట్లను దళిత బంధుకు కేటాయించి ఒక్క రూపాయి కూడా విడుదల చేయని కేసీఆర్.. ఇప్పుడు  ఈ బడ్జెట్ లో  దళిత బంధును ప్రస్తావించలేదని మాట్లాడడాన్ని బట్టి నవ్వాలో...ఏడ్వాలో అర్థం కావడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను గత ప్రభుత్వం మాదిరిగా డైవర్ట్ చేయబోమని,  బ్యాక్ లాగ్ నిధులను కూడా కలుపుకొని.. దళిత, గిరిజనుల సంక్షేమం కోసమే పూర్తిగా ఖర్చు పెడతామన్నారు. 

కామన్ మెన్ ఫ్రెండ్లీ బడ్జెట్: మంత్రి శ్రీధర్ బాబు 

ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్క అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్...కామన్ మెన్ ఫ్రెండ్లీ బడ్జెట్ అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.  రూ. 35 వేల కోట్ల నాన్ టాక్స్ రెవెన్యూను ఎలా భర్తీ చేస్తామనే విషయంలో ఎవరికి..ఎలాంటి అనుమానాలు అక్కరలేదన్నారు. పన్నులు వేయకుండానే వీటికి సరిపోయే నిధులను ఎలా సమీకరించాలో తమ వద్ద ప్లాన్​ ఉందన్నారు.