నెన్నెలలో  గంజాయి తాగుతున్న 8 మంది అరెస్ట్ : ఏసీపీ రవికుమార్

బెల్లంపల్లి రూరల్, వెలుగు: నెన్నెల శివారులోని చెరువు సమీపంలో గంజాయి తాగుతున్న 8 మంది యువకులను గురువారం అరెస్ట్​ చేసినట్లు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్​ తెలిపారు. రూరల్​సీఐ అఫ్జలోద్దీన్, నెన్నెల ఎస్ఐ ప్రసాద్​తో కలిసి బెల్లంపల్లి ఏసీపీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. పక్కా సమాచారంతో ఎస్ఐ సిబ్బందితో కలిసి చెరువు వద్దకు వెళ్లగా గంజాయి తాగుతున్న యువకులు పారిపోయేందుకు ప్రయత్నించగా వారిని పట్టుకున్నారు. తాళ్లగురిజాలకు చెందిన గంజాయి విక్రేత మహ్మద్​ముస్తాఫా వద్ద 169 గ్రాముల గంజాయి లభించింది.

ముస్తాఫాతో పాటు నెన్నెల మండలం గన్​పూర్​కు చెందిన పోతరాజుల ఆకాశ్, కన్నెపల్లి మండలం చర్లపల్లికి చెందిన శనిగారపు వినోద్, బెల్లంపల్లి మండలం దుగినేపల్లికి చెందిన జాడి సుందర్, చల్లూరి రమాకాంత్, నెన్నెలకు చెందిన దుర్గం స్వామి, పిట్ట శేఖర్, గుండ్లోమారానికి చెందిన రత్నం దేవేందర్​ను అరెస్ట్​ చేసి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. బెల్లంపల్లికి చెందిన జమీల్​పరారీలో ఉన్నట్లు తెలిపారు.