కార్తీకమాసం.. బిహారీలు చత్​ పూజలు.. సూర్యభగవానుడిని ఎలా పూజిస్తారంటే..

బిహారీల ఆరాధ్య దైవం సూర్యభగవానుడు. ఆయన అనుగ్రహం కోసం చేసేవే చత్ పూజలు. రకరకాల కల్చర్లకు నిలయమైన కాగజ్ నగర్ పట్టణంలో బిహారీలు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ పూజలు చేస్తుంటారు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేయడానికి 100కుటుంబాలకు పైగా బిహారీలు ఇక్కడకొచ్చి స్థిరపడ్డారు. వాళ్లంతా సంప్రదాయాలను మర్చిపోకుండా ప్రతిసారి ఈ వేడుకలు చేస్తున్నారు.

బిహరీలు భాస్కరుడి అనుగ్రహం కోసం చత్ పూజలు చేస్తారు. నాలుగు రోజుల పాటు చేసే ఈ పూజలు తెలంగాణలో చేసుకునే వ్రతాల్లాగే ఉంటాయి. పూజలు చేసే బిహారీ మహిళలు 36 గంటల పాటు ఉపవాసం ఉంటారు. కనీసం మంచినీళ్లు కూడా ముట్టకుండా నిష్టతో ఉండి దేవుడిని  కొలుస్తారు. 

చత్ పూజల్లో ముఖ్యమైనది  సూర్యుడికి నైవేద్యం పెట్టడం .. మహిళలంతా కలిసి వెదురుబుట్టలు, గంపల్లో సీజనల్ పండ్లు పెట్టి పొద్దుపొడవంగానే సూర్యుడికి నైవేద్యం పెడతారు. కోర్కెలు తీరాలని, కష్టాలు దూరం కావాలని కోరుకుంటారు. ఉదయం 3.30 గంటల నుంచి 5.30 గంటల వరకు, సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 వరకు మోకాళ్లలోతు నీళ్లలో నిలబడి సూర్యదేవుడిని ఆరాధిస్తారు. 

Also Read : కార్తీకమాసం.. దీపారాధాన.. దీపదానం..... ఫలితం ఇదే

సిర్పూర్​పేపర్​ మిల్​ కంపెనీల్లో  ఎక్కువ మంది బీహారీలు పని చేస్తుండడంతో వాళ్ల కోసం యాజమాన్యం ప్రతి సంవత్సరం పూజలకు ఏర్పాటు చేస్తోంది.  ఇక కాగజ్​ నగర్​ సిర్పూర్ పేపర్ మిల్లు పే గ్రౌండ్ లో, పూజల కోసం ప్రత్యేకంగా నీటి కొలను ఏర్పాటు చేయించింది. ప్రతిసారి బిహారీలు ఇక్కడే పూజలు చేస్తున్నారు. దాంతో పూజలను చూసేందుకు పట్టణంలోని వేలాదిమంది ఎస్సీఎంగ్రౌండ్ కు వస్తుంటారు. కంపెనీ యాజమాన్యం స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ పూజల్లో పాల్గొంటారు

సూర్యదేవుడి అనుగ్రహం కోసమే

నీళ్లలో ఉండి  సూర్యదేవుడిని  పూజిస్తారు . సూర్య భగవానుడి  కరుణ కోసం కార్తీకమాసం నెల రోజులు  పూజలు చేస్తారు. చత్ పూజలు చేయడం ద్వారా అన్ని విధాలా మేలు జరుగుతుందని వారు నమ్ముతారు. బిహారీలకు ఇది  ఎంతో ముఖ్యమైన పండుగ..  కాబట్టి వాళ్లు ఎక్కడ ఉన్నా.. వాళ్ల ఆచారాలకు కట్టుబడి పూజలు చేస్తారు.