కుల గణన సర్వేకు వారిని ఒప్పించండి: నిర్మల్ కలెక్టర్‎కు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలంలోని గుండంపల్లి, దిలావర్ పూర్ గ్రామస్తులు ఇథనాల్ పరిశ్రమ స్థాపనకు వ్యతిరేకంగా సమగ్ర కుటుంబ సర్వేను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ స్పందించారు. శనివారం నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్‌‌‌‌తో ఆయన ఫోన్‌‌‌‌లో మాట్లాడారు. గ్రామస్తులను సంప్రదించి ఈ సర్వే గురించి వారికి వివరించి, అడ్డుకోకుండా ఒప్పించాలని కోరారు. గ్రామస్తులతో చర్చలు జరుపుతున్నామని, సర్వేకు సహకరించేలా వారిని ఒప్పిస్తామని నిరంజన్‌‌‌‌కు కలెక్టర్ వివరించారు. 

రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి ఘటనలు ఎదురైతే కలెక్టర్లు, అధికారులు ప్రజలతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులను తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కులగణన నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. జనాభాకు అనుగుణంగా నిధుల కేటాయింపు, వెనుకబడిన కులాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించటానికి ఈ సర్వే ఎంతో కీలకమని పేర్కొన్నారు.