బాసర ట్రిపుల్ ఐటీలో ఆగని ఆందోళనలు

  • ఇన్ చార్జ్ వీసీని తొలగించాలంటూ విద్యార్థుల డిమాండ్  
  • ఐదు రోజులుగా కొనసాగుతున్న నిరసన కార్యక్రమాలు

నిర్మల్, వెలుగు: బాసర ట్రిపుల్ ఐటీలో తమ సమస్యలు పరిష్కరించాలని ఐదు రోజుల నుంచి స్టూడెంట్లు క్యాంపస్ లో ప్లకార్లులతో నిరసనలు తెలుపుతున్నారు. ఆదివారం ఇన్​చార్జ్ వైస్ చాన్సలర్ వెంకటరమణ హైదరాబాద్ నుంచి క్యాంపస్ కు వచ్చిన విషయం తెలుసుకున్న విద్యార్థులంతా ఆయన గెస్ట్ హౌస్ వద్దకు వెళ్లి బైఠాయించారు. వీసీ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. తమకు రెగ్యులర్ వీసీని నియమించాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్​చార్జ్ వీసీ హయాంలో సమస్యలు పరిష్కారం కావడం లేదని, తమ సమస్యలపై సర్కారుకు తప్పుడు నివేదికలు అందుతున్నాయని ఆరోపించారు.  

ట్రిపుల్ ఐటీ విద్యార్థుల బాగోగులు చూసే సీనియర్ ప్రొఫెసర్లలో ఒకరిని వీసీగా నియమించాలని డిమాండ్ చేశారు. హాస్టల్ మెస్ కాంట్రాక్ట్ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించి, ఇక్కడి కొందరి గుత్తాధిపత్యం నుంచి మెస్ లను తొలగించి..  కొత్త ఏజెన్సీలకు కేటాయించాలని కోరారు. దీంతోపాటు టీచింగ్, నాన్ టీచింగ్ నియామకాలను కాంట్రాక్ట్ పద్ధతిలో కాకుండా రెగ్యులర్ గా నియమించాలన్నారు. క్యాంపస్ లోని ఆస్పత్రిలో విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా గైనకాలజిస్టును నియమించాలన్నారు.  ఆస్పత్రిని ఆధునీకరించి అదనపు సౌకర్యాలు కల్పించాలన్నారు.  మొత్తం 17 రకాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

త్వరలోనే సీఎంను కలుస్తామంటున్న విద్యార్థులు

ట్రిపుల్ ఐటీలోని సమస్యలతో పాటు ఇన్​చార్జి వీసీని తొలగించాలని, రెగ్యులర్ వీసీ, డైరెక్టర్ ను నియమించాలని కోరుతూ విద్యార్థులంతా సీఎం రేవంత్ రెడ్డిని త్వరలో కలిసేందుకు హైదరాబాద్ వెళ్లనున్నట్లు సమాచారం. గతంలో విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపి బాసర వరకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ఇక్కడి పరిస్థితులన్నీ తెలుసని, ఆయన తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తారని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లను సంబంధిత ఉన్నతాధికారులు పట్టించుకోకుండా ముఖ్యమంత్రికి తప్పుడు సమాచారం అందిస్తున్నారం టూ ఆరోపిస్తున్నారు. తాడోపేడో తేల్చుకునేందుకు తామే సీఎంను స్వయంగా కలిసి సమస్యలను విన్నవించనున్నట్టు  పలువురు విద్యార్థులు పేర్కొన్నారు.