భక్తులతో కిటకిటలాడిన  బాసర ఆలయం

  • గోదావరి నదిలో భక్తుల పుణ్య స్నానాలు

బాసర, వెలుగు : కార్తీక మాసం తొలి సోమవారం బాసర పుణ్యక్షేత్రం గోదావరి నది తీరం వద్ద భక్తులతో కిటకిటలాడింది. గోదావరి నదిలో స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం కార్తీక దీపాలు వెలిగించి సూర్యేశ్వర ఆలయంలో ఆది శంకరుడికి ప్రత్యేక అభిషేక అర్చన నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. నది తీరాన గల సూర్యేశ్వర ఆలయంలో  కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని స్థానాచార్యులు ప్రవీణ్ పాటక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి ఆధ్వర్యంలో అర్చకులు వేద పండితులు ఆదిశంకరుడికి ఏకాదశ రుద్రాభిషేకం, అష్టోత్తర శతనామ, అర్చన మహా హారతిని నిర్వహించారు. పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో విజయ రామారావు, భక్తులు పాల్గొన్నారు.