విచ్ఛిన్న శక్తులతో జాగ్రత్తగా ఉండాలి : బండి సంజయ్

  • కొందరి ప్రమేయంతో విద్యావ్యవస్థ నాశనం
  • బంగ్లాదేశ్ లో సంక్షోభమే నిదర్శనం

మంచిర్యాల, వెలుగు: దేశంలో జరుగుతున్న పరిణామాలు, దేశభక్తి వంటి అంశాలపై విద్యార్థులు, యువతలో అవగాహన కల్పించకపోతే దేశం విచ్ఛిన్నమయ్యే ప్రమాదముందని, ఇందుకు బంగ్లాదేశ్ పరిణామాలే నిదర్శమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం రాంపూర్​లోని విద్యారణ్య ఆవాస విద్యాలయ నూతన భవన నిర్మాణానికి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. 

ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి శిశు మందిర్ భవనాన్ని నూతనంగా నిర్మించేందుకు పూర్వ విద్యార్థులే ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. ఇక్కడ విద్యాసంస్థ కోసం 33 ఎకరాలిచ్చిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేట్ స్కూళ్లు కెరీర్ పేరుతో చదువు చెప్పడానికే పరిమితమవుతున్నా యని, సంస్కృతి, సంప్రదాయాలను పట్టించుకో వడం లేదన్నారు.

విద్యా వ్యవస్థలో నక్సల్ భావజాలం చొప్పించే కుట్ర

రాష్ట్రంలో నక్సల్ భావజాలమున్న కొందరి ప్రమేయంతో విద్యావ్యవస్థ నాశనమయ్యే దుస్థితి ఏర్పడింది. దేశ చరిత్ర, సంస్కృతి మరుగునపడే ప్రమాదముందన్నారు. ‘బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ అనే అంశాన్ని తీసుకుని అక్కడి యువత, విద్యార్థులు అల్లకల్లోలం సృష్టించి యావత్ దేశాన్ని ప్రమాదంలోకి నెట్టేశారు. బంగ్లాదేశ్ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. వాళ్ల డిమాండ్లు న్యాయమైనవే కావచ్చు. కానీ వాళ్ల వెనుకుండి నడిపిస్తున్న వాళ్ల ప్రయోజనాలేమిటి? దీనివల్ల దేశానికి జరిగే నష్టమేమిటి? అనే అంశాలపై అక్కడి యువత, విద్యార్థుల్లో అవగాహన కల్పించలేకపోవడంవల్లే ఆ దేశం నేడు క్లిష్టపరిస్థితుల్లో ఉంది’ అని పేర్కొన్నారు. 

బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో భారతదేశంలోని యువత, విద్యార్థులు అత్యంత జాగ్రత్తగా ఉంటూ దేశ పరిణామాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అంతకుముందు సంజయ్ దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామిని దర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావు, నాయకులు పాల్గొన్నారు.