సిద్ధిపేట, వెలుగు: సిద్దిపేట పట్టణంతో పాటు శివార్లలో కబ్జా చేసిన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ఇలాంటి చర్యలకు పాల్పడిన బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు ఇమామ్ డిమాండ్ చేశారు. శనివారం అత్తు మీడియాతో మాట్లాడుతూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో సర్వేనెంబర్ 1340, 1301, 1668 లలో బీఆర్ఎస్ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, వారు చెప్తేనే ఇంటి నెంబర్, కరెంట్ మీటర్ కనెక్షన్లను అధికారులు శాంక్షన్ చేస్తున్నారని ఆరోపించారు.
మిట్టపల్లి గ్రామంలోని సర్వే నంబర్లు 967. 19. 315/1 నుంచి 315/9 వరకు 333, 312/1. 321/D లలో ప్రభుత్వ భూమిని కొందరు బీఆర్ఎస్ నేతలు కబ్జా చేసి 59 జీవో కింద రెగ్యులరైజేషన్ కోసం అప్లై చేసుకున్నారని వాటిని వెంటనే పరిశీలించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై సిద్దిపేట అర్బన్ తహసీల్దారు కార్యాలయంలో వినతిపత్రాన్ని సమర్పించామని, దీనిపై చర్యలు తీసుకోకుంటే కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.