ఆసిఫాబాద్ జిల్లాలో మహిళపై దాడి చేసిన 14 మందికి జైలు శిక్ష

ఆసిఫాబాద్, వెలుగు: మహిళపై మారణాయుధాలతో దాడి చేసిన కేసులో 14 మందికి మూడేండ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ ఆసిఫాబాద్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది.  వివరాలను ఎస్పీ డీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. కౌటాల పీఎస్ పరిధిలోని ముత్యంపేట్ కు చెందిన మహిళ గాదిరెడ్డి నాగమణి తన ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలం విషయంలో అదే గ్రామానికి చెందిన కస్తూరి సత్యనారాయణతో కొన్నేండ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ స్థలంలో నాగమణి ఇంటి నిర్మాణ పనులు మొదలుపెట్టగా.. 2021ఫిబ్రవరి 5న మారణాయుధాలతో కొందరు ఆమెపై దాడి చేశారు. 

దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్రామానికి చెందిన కస్తూరి సత్యనారాయణ, కృష్ణ చైతన్య, వంశీకృష్ణ, దుర్గయ్య, సంతోష్, పూల మధుకర్, సాయితేజ, ధోనీ శ్రీధర్, గోలేటి విశ్వనాథ్, లక్ష్మీ కళావతి, పద్మ, అంకుబాయి, నాగరాజు దాడి చేశారని, ఈ దాడి చేసేందుకు రావి శ్రీనివాస్ ప్రోద్బలం అందించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. 

ఆసిఫాబాద్ కోర్టు లైజనింగ్ ఆఫీసర్ రాంసింగ్, కాగజ్​నగర్ సబ్ డివిజన్ సబ్ కోర్టు ఇన్​చార్జ్ షిండే బాలాజీ ఆధ్వర్యంలో కోర్టులో 14 మంది నిందితులను ప్రవేశపెట్టగా.. పరిశీలించిన న్యాయమూర్తి కె.యువరాజ్ వారికి మూడేండ్ల జైలు శిక్షతో పాటు రూ.7 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. నిందితులకు శిక్ష పడేలా విచారణ చేసిన కాగజ్ నగర్ డీ ఎస్పీ రామానుజం, కౌటాల సీఐ రమేశ్, ఎస్ఐ మధుకర్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.