ఏపీ టు మహారాష్ట్ర..కంటైనర్లో గంజాయి రవాణా

  • ఏపీ టు మహారాష్ట్రకు గంజాయి రవాణా
  • కంటైనర్ లోని 290 కేజీల గంజాయిని పట్టుకున్న ఆసిఫాబాద్ పోలీసులు

ఆసిఫాబాద్, వెలుగు: ఏపీలోని రాజమండ్రి నుంచి మహారాష్ట్రకు కంటైనర్ లో గంజాయిని తరలిస్తుండగా పట్టుకుని.. 290 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఆసిఫాబాద్ ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. వాంకిడి పీఎస్ లో మీడియాకు వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అంతరాష్ట్ర సరిహద్దు వాంకిడి వద్ద పోలీసులు చెక్ పోస్ట్ పెట్టి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. 

ఆసిఫాబాద్ వైపు నుంచి మహారాష్ట్ర కు వెళ్తున్న కంటైనర్ అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో పోలీసులు ఆపి డ్రైవర్ ను విచారించి తనిఖీ చేయగా భారీగా గంజాయి దొరికింది. మధ్యప్రదేశ్ కు చెందిన కంటైనర్ డ్రైవర్ బల్వీర్ సింగ్ మహారాష్ట్రకు చెందిన అరబింద్ అనే వ్యక్తి గంజాయి కోసం రాజమండ్రికి పంపాడని,లోడ్ చేసుకుని తిరిగి వస్తుండగా పట్టుకున్నామని చెప్పాడు. నిందితుడి వద్ద 145 గంజాయి ప్యాకెట్లు, ఒక్కొక్కటి 2  కేజీల చొప్పున, మొత్తం 290 కిలోలు , రూ. 72 లక్షల విలువైన గంజాయి, కంటైనర్,మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

కంటైనర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నామని, ప్రధాన నిందితుడు అరబింద్ ను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను  మధ్యప్రదేశ్ కు పంపినట్లు ఎస్పీ తెలిపారు. ఆసిఫాబాద్ డీఎస్పీ కరుణాకర్, వాంకిడి సీఐ సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్, ఆసిఫాబాద్ సీఐ రవీందర్, వాంకిడి ఎస్ఐ ప్రశాంత్,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.