ఆసిఫాబాద్ జిల్లా ఆస్పత్రిలో జీతాలురాక ఒంటి కాలుపై నిలబడి కార్మికుల నిరసన

అసిఫాబాద్, వెలుగు: మూడు నెలలుగా జీతాలు రావడంలేదని, వెంటనే విడుదల చేయాలని ఆసిఫాబాద్ పట్టణంలోని జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న పారిశుధ్య, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, సూపర్​వైజర్ కార్మికులు ఏఐటీయూసీ పిలుపు మేరకు ఆందోళన చేపట్టారు. జిల్లా ఆస్పత్రి ఎదుట బుధవారం ఒంటి కాలుపై నిలబడి ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు టి.దివాకర్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి మాట్లాడుతూ.. మూడు నెలలుగా కార్మికులకు జీతాలు చెల్లించకుండా ఏజెన్సీ కాంట్రాక్టర్లు వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

కార్మికులకు నెలల తరబడి వేతనాలు పెండింగ్​లో ఉంచితే వారి జీవనం సాగేదెలా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ప్రభుత్వ ఉద్యోగులు తరహాలో ప్రతి నెలా 5వ తారీఖులోపు జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ జీతాల బడ్జెట్ విడుదల చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆస్పత్రి కార్మికులు మల్లేశ్, మురళి, సత్తార్, మమత తదిత రులు పాల్గొన్నారు.