స్టూడెంట్ల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

తిర్యాణి, వెలుగు: ట్రైబల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ స్కూళ్ల వసతి గృహాల్లో  స్టూడెంట్ల  ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కుమ్రంభీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. సోమవారం తిర్యాణి మండలంలోని రొంపల్లి, గుండాల, మంగి ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్లలో ఆకస్మిక తనిఖీ చేశారు. పరిసరాలు, డార్మెటరీ, వంటగది రిజిస్టర్ లను పరిశీలించారు. మెనూ ప్రకారం ఆహారాన్ని స్టూడెంట్ లకు అందించాలని టీచర్లకు సూచించారు. స్కూళ్లలో నీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని,  మిషన్ భగీరథ ట్యాంకుల్లో మోటార్లను బిగించి అందుబాటులోకి తేవాలన్నారు. 

స్కూళ్లలో అవసరమైన  టాయిలెట్, వంటగదులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్కూళ్లకు రాని పిల్లలను గుర్తించి స్కూళ్లలో వచ్చేలా చూడాలని, తల్లిదండ్రులు స్టూడెంట్ లను స్కూలుకు పంపేలా చూడాలని అన్నారు. మంగి, గుండాల సబ్ సెంటర్ పనులను వేగవంతం చేసి రోగులకు ట్రీట్మెంట్ అందేలా  చూడాలని పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో మహిళా స్వశక్తి సంఘాలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న స్కీంను  మహిళలు సద్వినియోగం చేసుకోని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలిపారు. 

మారుమూల గ్రామాలలో అంతర్గత రహదారుల నిర్మాణం కోసం నాలుగు కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయన్నారు. మంగి నుంచి  మాణిక్య పూర్ , రొంపల్లి నుండి గుండాల వరకు రోడ్డు ను పరిశీలించారు. గుండాల గ్రామంలో నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్  ఏర్పాటు తర్వాత పింఛన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సూర్యప్రకాశ్, ఎస్సై తీగల మాధవ్ గౌడ్,  ఆర్డబ్ల్యూఎస్ కృష్ణ తేజ, పంచాయతీరాజ్ ఈ ఈ ప్రభాకర్, డీ ఈ రాజన్న,  ఏటీడీవో చిరంజీవి,  ఎంపీడీవో మల్లేశ్, తదితరులు ఉన్నారు.