పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తిచేయాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు : జిల్లాలో పత్తి కొనుగోళ్లకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్ దాసరి వేణుతో కలిసి కాటన్ కార్పొరేషన్, వ్యవసాయ, మార్కెటింగ్, విద్యుత్, అగ్నిమాపక, రవాణా, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 3.30 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారని, 23 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. 

జిల్లాలో 17 జిన్నింగ్ 

మిల్లుల్లో కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేయాలని, ప్రభుత్వం పత్తి మద్దతు ధర క్వింటాల్​కు రూ.7,521గా నిర్ణయించిందని చెప్పారు. అగ్నిమాపక, విద్యుత్, తూనికలు కొలతల శాఖల అధికారులు జిన్నింగ్ మిల్లులను సందర్శించి సౌకర్యాలు, ఏర్పాట్లపై నివేదిక అందించాలని ఆదేశించారు. జిన్నింగ్ మిల్లు యజమానులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రక్షణ చర్యలు తీసుకోవాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియ జరిగేలా ఏర్పాట్లు 
చేయాలన్నారు.  

ఏర్పాట్లు పూర్తి

నిర్మల్, వెలుగు : సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు మార్కెటింగ్ నిర్మల్ ఏడీ శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. పత్తి పంట అమ్మకానికి వచ్చే రైతులు తమ బ్యాంక్ ఖాతాలు పనిచే స్తున్నాయో లేదో సరిచూసుకొని రావాలని సూచించారు. రైతుల ఆధార్ కార్డ్ అథెంటికేషన్ తప్పనిసరిగా ఉండాలని, ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్  ఖచ్చితంగా అనుసంధానం చేసుకొని ఉండాలని తెలిపారు.