ఆసిఫాబాద్, వెలుగు: కెరమెరి మండలంలోని జోడేఘాట్ లో అక్టోబర్ 17న నిర్వహించనున్న కుమ్రం భీం 84వ వర్ధంతి కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి సక్సెస్ చేయాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే కోరారు.
శనివారం కెరమెరి మండలం జోడేఘాట్ లోని మ్యూజియం హాల్ లో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, వెడ్మ బొజ్జు, డీఆర్ వో లోకేశ్వర్ రావు, కుమ్రంభీం మనమడు కుమ్రం సోనేరావుతో కలిసి 29 శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ నాయకులతో సమీక్ష నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. ఆదివాసీ, గిరిజనుల ఆరాధ్య దైవం కుమ్రంభీం వర్ధంతి వేడుకలు అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఐటీడీఏ విద్య, పోలీసు శాఖల సమన్వయంతో కార్యక్రమాల నిర్వహణ, శాంతి భద్రతల పరిరక్షణ చర్యలు చేపట్టాలని, విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జోడేఘాట్తో పాటు పరిసర గ్రామాలు, ప్రాంతాలలో ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్, నీటిసరఫరా అందించేలా చూడాలని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల ద్వారా స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు.