ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ అమలు చేయాలి : సీఐటీయూ 

ఆదిలాబాద్/నస్పూర్, వెలుగు: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ బస్టాండ్ ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసే ప్రయత్నం చేయగా పోలీసులు  అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే పోలీసుల దగ్గర నుంచి దిష్టిబొమ్మను తీసుకొని దహనం చేశారు. ఎన్నో ఏళ్లుగా చాలీచాలని జీతాలతో విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న అన్నారు.

కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలనే డిమాండ్ తో చలో హైదరాబాద్​కు పిలుపునిస్తే పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. నస్పూర్ పీహెచ్​సీలో ఆశా వర్కర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నరసన తెలిపారు. సోమవారం ఆశాలను పోలీసులు అడ్డుకొని అక్రమంగా అరెస్టులు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుచేయకుంటే పోరాటాలు చేస్తామన్నారు. జిల్లా అధ్యక్షురాలు అకుల వాణి, పీఎచ్​సీ లీడర్స్ సట్ల సధ్యారాణి, పద్మ తదితరులు పాల్గొన్నారు.