నెట్వర్క్, వెలుగు: తమ సమస్యలు తీర్చాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులు నినదించారు. సీఐటీయూ ఆల్ ఇండియా కమిటీ, ఆశా యూనియన్ ఆల్ ఇండియా ఫెడరేషన్ ఇచ్చిన డిమాండ్స్డే పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లు, అంగన్వాడీలు ఆయా విభాగాల్లో పనిచేసే కార్మికులు బుధవారం పలుచోట్ల నిరసనకు దిగారు. బెల్లంపల్లి పట్టణంలో నీ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. పే కమిక్షన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు సింగరేణి ఏఎంసీ క్రీడా మైదానం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. 2024-25 బడ్జెట్లో అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు బడ్జెట్ పెంచాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
ఐసీడీఎస్ లను ప్రవేట్ పరం చేయాలనే కేంద్ర ప్రభుత్వ విధానాలను ఉపసంహరించుకోవాలన్నారు. కాగజ్ నగర్ డివిజన్ లోని కాగజ్ నగర్, సిర్పూర్ టీ, కౌటాల మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల వద్ద కార్మికుల యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మందమర్రిలో తహసీల్దార్ ఆఫీస్ ఎదుట కార్మికులు నిరసన చేపట్టారు. దహెగాం మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కవితకు వినతిపత్రం అందజేశారు.