ఎమ్మెల్సీ ఎలక్షన్ కు ఏర్పాట్లు పూర్తి

  •     ఓటింగ్ కు సిద్దమవుతున్న గ్రాడ్యుయేట్లు
  •     చేర్యాల సబ్ డివిజన్ లో 5 పోలింగ్ కేంద్రాలు
  •     ఓటు హక్కువినియోగించుకోనున్న   4679 మంది ఓటర్లు

సిద్దిపేట, వెలుగు: వరంగల్, ఖమ్మం, నల్గొండ  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.  చేర్యాల సబ్ డివిజన్ పరిధిలోని 4679  మంది గ్రాడ్యుయేట్స్ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కొమురవెల్లి, మద్దూరు, ధూల్మిట్ట మండల కేంద్రాల్లో ఒక్కో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా చేర్యాలలో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.  ఈ ఎన్నికలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు మొత్తం 52 మంది పోటీ చేస్తున్నారు.  సోమవారం ఉదయం  8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ను నిర్వహిస్తారు. 

2021 మార్చిలో  జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వరరెడ్డి ఎన్నికైనా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ ఎమ్మెల్యేగా గెలవడంతో ఖాళీ అయిన స్థానానికి బై ఎలక్షన్ నిర్వహిస్తున్నారు.  బ్యాలెట్ పేపర్ తో పోలింగ్ నిర్వహిస్తుండడంతో ఆదివారం సిద్దిపేట కలెక్టరేట్​లో పోలింగ్ సిబ్బందికి సామగ్రిని పంపిణీ చేశారు. ఆరుగురు  ప్రిసైడింగ్ అధికారులు , ఆరుగురు  అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఆరుగురు అదనపు పోలింగ్ ఆఫీసర్ల తో పాటు 12 మంది మైక్రో అబ్జర్వర్లు పాల్గొంటున్నారు. ఓటర్లు ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసేందుకు వాయిలెట్ కలర్ స్కెచ్ తో పాటు ఇండెలిబుల్ ఇంక్ ను వినియోగిస్తున్నారు.  

ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేసిన ఓటర్ల కు ఎడమ చేయి మధ్య వేలుకు ఇంక్ మార్కును వేయనున్నారు.  5  పోలింగ్ కేంద్రాల జియో ట్యాగింగ్ పూర్తి చేయడమే కాకుండా 28వ తేదీ ఉదయం 8  గంటల వరకు 144 సెక్షన్ ను అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న), బీఆర్ఎస్  నుంచి రాకేశ్​రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డితో పాటు మరో 49 మంది పోటీ పడుతున్నారు. 

చేర్యాల సబ్ డివిజన్ లో అభ్యర్థులు నామ మాత్రంగానే ప్రచారాలు నిర్వహించారు. మూడు ప్రధాన రాజకీయ పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో నిలిచినా ఎవరు చేర్యాల సబ్ డివిజన్ లో సమావేశాలు ప్రచారాల్లో పాల్గొనలేదు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్​రెడ్డికి మద్దతుగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేర్యాలలో ఒకసారి సమావేశాన్ని నిర్వహించగా మిగిలిన​ అభ్యర్థుల పక్షాన వారి మద్దతుదారులే ఓటర్ల ను కలిసి ప్రచారం నిర్వహించారు.