- నాపై దాడి చేసిన వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలి
- డెయిరీ తిరిగి ప్రారంభిస్తా
- అరిజిన్ డెయిరీ సీఏఓ బోడపాటి షేజల్
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమ కంపెనీ ఏర్పాటు కోసం అమ్మిన భూమిని రైతులకు బహుమానంగా ఇస్తానని అరిజిన్ డెయిరీ సీఏవో బోడపాటి షేజల్ వెల్లడించారు. బెల్లంపల్లి మండలం కన్నాల శివారులోని సర్వేనెంబర్ 89లో తమకు చిన్నయ్య మూడు ఎకరాలు అమ్మాడని చెప్పారు. బుధవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరిజిన్ డెయిరీ సీఈవో కందిమల్ల ఆదినారాయణతో కలిసి ఆమె మాట్లాడారు. +
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో తాము డెయిరీ ఏర్పాటు చేయాలని సంకల్పించామన్నారు. కానీ, బీఆర్ఎస్ కు చెందిన బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనుచరులతో తనపై దాడులు చేయించి తప్పుడు కేసులు పెట్టించారని ఆరోపించారు. తనపై రాళ్లతో దాడి చేసినా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై దాడులు చేసిన గోలి శివ, భీమశంకర్, సాన శ్రావణ్ తదితరులపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే తనకు చేసిన అన్యాయంపై న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. పాడి రైతుల కోసం త్వరలో అరిజిన్ డెయిరీ తిరిగి ప్రారంభించనున్నట్లు తెలిపారు.