ప్రధాన పార్టీ అభ్యర్థులు ముగ్గురిలో గెలుపు ధీమా
ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపారనే దానిపై సర్వత్రా ఆసక్తి
మెదక్, వెలుగు: రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగినప్పటికీ అందరి దృష్టి మెదక్లోక్ సభ స్థానంపైనే ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడమే కారణం. ఎగ్జిట్ పోల్స్‌లో మెజార్టీ సంస్థలు బీఆర్ఎస్ ఒకటి, రెండు స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
అందులోమెదక్ మొదటిది కావొచ్చనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. గడచిన 25 ఏళ్లుగా ప్రతీ లోక్‌సభ ఎన్నికల్లోనూ ఓటమి చవిచూస్తున్న కాంగ్రెస్, బీజేపీలు ఈ ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతిష్టాత్మకంగా జరిగిన పోరులో ఏ పార్టీని గెలుపు వరిస్తుందన్న దానిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. మొత్తం 44 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ముగ్గురు అభ్యర్థులు ఎవరికీ వారు గెలుపు తమదే అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
డబుల్ హ్యాట్రిక్‌పై బీఆర్ఎస్ ఆశ
వరుసగా గడచిన ఐదు పార్లమెంట్ఎన్నికల్లో గెలుపొంది మెదక్ లోక్ సభ నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్న బీఆర్ఎస్ ఈ సారి ఎన్నికల్లో సైతం గెలుపొంది డబుల్‌హ్యాట్రిక్ కొట్టి తమ కంచుకోటను ఎవరూ బద్ధలు కొట్టలేరని చాటాలని ఆశిస్తోంది. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో ఆరుచోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండడం, మొత్తం లోక్ సభ నియోజకవర్గ వ్యాప్తంగా 2.48 లక్షల మెజార్టీ లభించడంతో గెలుపు తమదే అన్న ధీమాలో గులాబీ పార్టీ ఉంది. మెదక్ టికెట్ ను పలువురు ఆశించినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అధినేత అనూహ్యంగా ఎమ్మెల్సీ, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి టికెట్ఇచ్చి బరిలో దించారు.
కాగా పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తోపాటు, తాను సైతం ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్లు ఇదే లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఉండడంతో మాజీ మంత్రి హరీశ్ రావు తానే అభ్యర్థి అన్నట్టు వెంకట్రామిరెడ్డి గెలుపునకు తీవ్రంగా కృషి చేశారు. మరోవైపు కేసీఆర్ సైతం బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ఓ బహిరంగ సభలో, నాలుగు చోట్ల కార్నర్ మీటింగ్‌లలో పాల్గొన్నారు. మోదీ చరిష్మాపై బీజేపీ ఆశలు
దేశమంతటా మోదీ గాలి వీస్తోందని, వరుసగా మూడో సారి కేంద్రంలో బీజేపీ సర్కార్ కొలువు దీరనుందని ఈ క్రమంలో మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో సైతం బీజేపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ గట్టి నమ్మకంతో ఉంది. 2019 పార్లమెంట్ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావునే ఈ ఎన్నికల్లో సైతం బరిలో దించింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి లోక్ సభ నియోజకవర్గంలోని అన్నిఅసెంబ్లీ సెగ్మెంట్లలో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ క్యాడర్‌ను సమాయాత్తం చేయడంతోపాటు, నామినేషన్ వేసిన తర్వాత ముమ్మర ప్రచారం నిర్వహించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, గోవా సీఎం ప్రమోద్ సావంత్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వంటి అగ్రనేతల ప్రచారంతో క్యాడర్ రెట్టించిన ఉత్సాహంతో పని చేయడంతో పాటు, అన్ని ప్రాంతాల్లో, అన్నివర్గాల ప్రజల నుంచి మద్దతు లభించిందని, ఎక్కడికి వెళ్లినా, ఎవరిని కదిలించినా మోదీకి ఓటేస్తామనే మౌత్ టాక్ రావడంతో బీజేపీ గెలుపు ఖాయమని కమలం పార్టీ విశ్వసిస్తోంది.
గ్యారంటీలే గెలుపు బాటలు
గత 25 ఏళ్లుగా మెదక్ లోక్ సభ స్థానంలో ఓటమి చవిచూస్తున్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొంది పరువు నిలుపుకోవాలని ఆశిస్తోంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో లోక్ సభ నియోజకవర్గ పరిధిలో కేవలం ఒక్క మెదక్ లో తప్ప మిగిలిన ఆరు సెగ్మెంట్లలో ఓటమి చెందినప్పటికీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఊపుమీదుంది. ప్రత్యర్థి పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు ఓసీ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వగా, కాంగ్రెస్ బీసీ అభ్యర్థి నీలం మధును బరిలో దించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు, సంక్షేమ పథకాలు గెలుపునకు బాటలు వేస్తాయని ఆ పార్టీ నమ్ముతోంది.
లోక్ సభ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సవాల్‌గా తీసుకుని నీలం మధు గెలుపు కోసం శ్రమించారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కి చెందిన కీలక మాజీ ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్, బీజేపీని వీడి కాంగ్రెస్ చేరడం ద్వారా పార్టీ బలం బాగా పెరిగిందని, ఇది మధు గెలుపునకు బాటలు వేస్తుందని హస్తం పార్టీ భరోసాతోఉంది.