కార్మికులను సంఘాలు తప్పుదోవపట్టిస్తున్నాయి : వాసిరెడ్డి సీతారామయ్య

  • ఏఐటీయూసీ స్టేట్​ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య

కోల్​బెల్ట్, వెలుగు:​ లాభాల వాటా విషయంలో కార్మికులను కొన్ని సంఘాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ స్టేట్​ప్రెసిడెంట్​వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. ఆదివారం మందమర్రిలోని ఏఐటీయూసీ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన కాంట్రాక్ట్​కార్మికుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 

గత ప్రభుత్వాలు, సింగరేణి యాజమాన్యం స్థూల లాభం చెప్పకుండా ఇన్వెస్ట్​మెంట్​పోనూ మిగిలిన నికర లాభాన్ని కంపెనీకి వచ్చిన లాభాలుగా చూపించాయని ఆరోపించారు. దానికి భిన్నంగా ఈ ఏడాది రూ.4,701 కోట్ల లాభాలు చూపి అందులో ఇన్వెస్ట్​మెంట్​తీసివేసిన తర్వాత రూ.2,414 కోట్లు చూపి కార్మికుల వాటాను 33 శాతంగా ప్రకటించినట్లు చెప్పారు.

 వాస్తవ, స్థూల లాభాలను కంపెనీ ప్రకటించినప్పటికీ కొన్ని కార్మిక సంఘాలు అవగాహన లేకుండా లాభాలపై కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. కార్మికవర్గానికి ప్రయోజనం కలిగేలా ఏఐటీయూసీ యూనియన్​చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ ఏడాది  కార్మికులకు రూ.లక్షన్నర నుంచి రూ.2లక్షల వరకు లాభాల వాటా వస్తుందని, రూ.93,750 దీపావళి బోనస్ అందుతుందన్నారు.

 సింగరేణి చరిత్రలో మొదటిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల వాటా ఇప్పిస్తున్న ఘనత ఏఐటీయూసీకి దక్కుతుందన్నారు. కేంద్ర కమిటీ సెక్రటరీ ఎండీ అక్బర్​ అలీ, మందమర్రి, బెల్లంపల్లి బ్రాంచీల సెక్రటరీలు సత్యనారాయణ, దాగం మల్లేశ్,​ వైస్​ ప్రెసిడెంట్ ఇప్పకాయల లింగయ్య, జాయింట్​ సెక్రటరీ కంది శ్రీనివాఃఈస్, కాంట్రాక్ట్ ​వర్కర్స్​ యూనియన్ లీడర్ జెట్టి మల్లయ్య, పిట్, ఏరియా లీడర్లు పాల్గొన్నారు.