చిలప్ చెడ్, వెలుగు: పోలీసుల బందోబస్తు మధ్య వ్యవసాయ అధికారులు రైతులకు జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు. సోమవారం చిలప్ చెడ్ లోని రైతు ఆగ్రోస్ సేవా కేంద్రానికి 100 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న రైతులు అధిక సంఖ్యలో ఆగ్రోస్ రైతు సేవ కేంద్రానికి తరలివచ్చారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో వ్యవసాయ అధికారులు పోలిసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు వచ్చి వరుస క్రమంలో రైతులను నిలబెట్టి పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ తెచ్చిన వారికి జీలుగు విత్తనాల బస్తాలు అందజేశారు.
ఆగ్రోస్ రైతుసేవ కేంద్రానికి 300 క్వింటాళ్ల జీలుగా విత్తనాలు అవసరం ఉందని ఇండెంట్ పెట్టగా 100 క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే వచ్చాయని వ్యవసాయ అధికారి బాల్ రెడ్డి తెలిపారు. కొంతమంది రైతులకే జీలుగా విత్తనాలు అందగా మరికొంతమంది వరుసలో నిలబడ్డ రైతులకు జీలుగ విత్తనాలు అందకపోవడంతో నిరాశతో వెనుతిరిగి ఇంటికి వెళ్లిపోయారు.