నిషేధించిన పిచికారీ మందులు అమ్మితే కఠిన చర్యలు : పుల్లయ్య

బజార్​హత్నూర్, వెలుగు: మహారాష్ట్ర సరిహద్దు మండలాల్లో నిషేధిత పిచికారీ మందులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్​ జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య హెచ్చరించారు. బజార్​హత్నూర్ మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపుల్లో మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. షాపుల్లోని పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫర్టిలైజర్ షాపుల్లో స్టాక్ బోర్డును ఎప్పటికప్పుడు రాయాలని, ఎరువులు, పిచికారీ మందులను ఎమ్మార్పీ ధరలకే అమ్మాలన్నారు.

రైతులకు కచ్చితంగా ఆన్​లైన్ బిల్లు ఇవ్వాలని, అందించిన మందు వివరాలను స్టాక్ లో రాయాలన్నారు. మహారాష్ట్ర సరిహద్దు మండలాల్లో నిషేధిత పిచికారీ మందులను కొందరు బ్లాక్​లో అమ్ముతున్నట్లు తెలిసిందని, అలాంటి వారిపై నిఘా ఉంచాలని మండల వ్యవసాయ అధికారులు, పోలీసులను ఆదేశించారు. మండల వ్యవసాయ అధికారి ప్రమోద్ రెడ్డి, సహకార సంఘం సీవో నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.