వెల్ఫేర్ హాస్టల్స్​లో అడ్మిషన్స్ షురూ

  • జిల్లాలో అన్నీ కలిపి 43 హాస్టల్స్​
  • ఈ ఏడాది  3,247 సీట్లు ఖాళీ

మెదక్​, వెలుగు:  అకడమిక్​ ఇయర్​ మొదలు కావడంతో వెల్ఫేర్​ హాస్టల్స్​లో అడ్మిషన్స్​ ప్రాసెస్​ షురూ అయింది. జిల్లాలో  బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రీ మెట్రిక్ హాస్టల్స్, ఇంటిగ్రేటెడ్​ హాస్టల్స్​, కాలేజీ హాస్టల్స్​ అన్నీ కలిపి 43 ఉన్నాయి. ఇందులో  కాలేజ్ హాస్టల్స్ 12 ఉన్నాయి. ఈ మొత్తం హాస్టల్స్​లో 7,100 సీట్లు ఉండగా, 2024-,25 అకడమిక్ ఇయర్ లో ప్రస్తుతానికి 3,247 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఖాళీల భర్తీకి సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. ఎస్సీ వెల్ఫేర్​ ప్రీ మెట్రిక్​ హాస్టల్స్​20 ఉన్నాయి. ఇందులో 4 ఇంటిగ్రేటెడ్​ హాస్టల్స్​, కాలేజ్​ హాస్టల్స్​ 4 ఉన్నాయి. 

16 ప్రీ మెట్రిక్ హాస్టల్స్​లో ఒక్కో దాంట్లో 100 చొప్పున మొత్తం 1,600 సీట్లు, 4 ఇంటిగ్రేటెడ్​ హాస్టల్స్​లో ఒక్కో దాంట్లో 300 చొప్పున మొత్తం 1,200 సీట్లు ఉన్నాయి. మెదక్ పట్టణంలోని బాయ్స్​, గర్ల్స్, రామాయంపేట గర్ల్స్​, నర్సాపూర్​ బాయ్స్​ కాలేజ్​ హాస్టల్స్​లో ఒక్కో దాంట్లో 100 చొప్పున మొత్తం 400 సీట్లు ఉన్నాయి. ​ కాగా ప్రస్తుతానికి ఆయా హాస్టల్స్​ అన్నింటిలో కలిపి 1,300 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్​ మూడు ఉన్నాయి. కౌడిపల్లి హాస్టల్​లో 200, మహ్మదాపూర్​ హాస్టల్​లో 150, టేక్మాల్​ హాస్టల్​లో 150 సీట్లు ఉన్నాయి. కాలేజ్​ హాస్టల్స్​ మెదక్​లో బాయ్స్,  గర్ల్స్​, నర్సాపూర్​ లో బాయ్స్​, గర్ల్స్​ ఉన్నాయి. ఒక్కో హాస్టల్​ లో 100 చొప్పున సీట్లు ఉన్నాయి.

వీటిలో 20 శాతం చొప్పున సీట్లు ఖాళీగా ఉన్నాయి. బీసీ ప్రీ మెట్రిక్​ హాస్టల్స్​ 17 ఉన్నాయి. వాటిలో ఒక్కో దాంట్లో 100 చొప్పున 1,700 సీట్లు ఉండగా, ఈ సంవత్సరానికి 653 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మెదక్ పట్టణంలో 2 , నర్సాపూర్​ పట్టణంలో 2 కాలేజ్​ హాస్టల్స్​ ఉన్నాయి. వీటిలో ఒక్కో దాంట్లో 100 చొప్పున 400 సీట్లు ఉండగా ఈ సంవత్సరానికి 141 సీట్లు 
ఖాళీగా ఉన్నాయి. 

యూనిఫామ్స్​, కాస్మోటిక్​ చార్జీలు 

హాస్టల్​ స్టూడెంట్స్​కు 2 జతల యూనిఫామ్స్​ తోపాటు, బెడ్ షీట్స్​, కార్పెట్​, టవల్స్, నోట్ బుక్స్​​ఫ్రీగా ఇస్తారు. మెస్​ చార్జీ 7వ తరగతి వరకు ఒక్కో స్టూడెంట్ కి రూ.1,050, 8,9,10 స్టూడెంట్స్​కు రూ.1,100, కాలేజ్​ స్టూడెంట్స్​కు రూ.1,500 చొప్పున  ఉంటుంది. అలాగే కాస్మోటిక్​ చార్జీ 7వ తరగతి వరకు గర్ల్స్​కు నెలకు రూ.55, 8,9,10 స్టూడెంట్స్​కు రూ.75 ఇస్తారు. బాయ్స్​కు కాస్మోటిక్​ చార్జీ నెలకు రూ.62 ఇస్తారు.