కుల బహిష్కరణ చేసిన 8 మందికి జైలు.. ఆదిలాబాద్ స్పెషల్ కోర్టు తీర్పు

ఆసిఫాబాద్, వెలుగు: కులాంతర వివాహం చేసుకున్నారనే కారణంతో కుల బహిష్కరణ చేసిన 8 మంది కుల పెద్దలకు నెల రోజుల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ ఆదిలాబాద్ స్పెషల్ పీసీఆర్ కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి ఎస్ ప్రశాంత్ తెలిపారు. వాంకిడిలోని రాంనగర్ కు చెందిన నౌగడే ఆత్మారాం కొడుకు సుభాష్​2020 మేలో కులాంతర వివాహం చేసుకున్నాడు. దీనిపై పంచాయితీ పెట్టిన కుల పెద్దలు.. సుభాష్​తోపాటు అతడి భార్యను నాలుగు సంవత్సరాల పాటు కుల బహిష్కరణ చేస్తూ తీర్మానించారు.

దీంతో బాధిత కుటుంబం వాంకిడి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్​హెచ్​వో ధీకొండ రమేశ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వారిని బహిష్కరిస్తూ తీర్పునిచ్చిన కుల పెద్దలు నౌగడే దాదాజీ, నౌగడే బాబురావు, నౌగడే బాహుజీ, చాప్లె సీతారాం, చౌదరి బిజ్జి, నౌగడే రమేశ్, హౌగడే పెంటు, లోనరే నాందేవ్​పై కేసు నమోదు చేశారు. బుధవారం పీపీ నవీన్ సాక్షులను కోర్టులో హాజరుపరచగా విచారణ జరిపిన జడ్జి టి.దుర్గారాణి  నేరం రుజువు కావడంతో నిందితులకు నెల రోజుల జైలు శిక్షతోపాటు రూ.500 చొప్పున జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. నిందితులకి శిక్ష పడేలా కృషి చేసిన వారిని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అభినందించారు.