ఆసిఫాబాద్, వెలుగు: వెనకబడిన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ తెలిపారు. ఎంపీగా గెలిచిన తర్వాత తొలిసారి ఆసిఫాబాద్‌కు వచ్చిన ఆయనకు శుక్రవారం బీజేపీ లీడర్లు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీనియర్ లీడర్ అరిగేల నాగేశ్వర్ రావు ఇంట్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఎంపీ మాట్లాడారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ డబ్బులు, మద్యం పంపిణీ చేయడంతోపాటు సంక్షేమ పథకాలు ఆశ చూపడంతో ఆసిఫాబాద్ నియోజకవర్గంలో అనుకున్న దానికంటే తక్కువ మెజార్టీ వచ్చిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతానని వెల్లడించారు. కేంద్రం నుంచి అధిక నిధులు తెచ్చి, సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, నాయకులు అరిగేలా మల్లికార్జున్ యాదవ్ , కొలిపాక కిరణ్ కుమార్, లీడర్లు పాల్గొన్నారు.