ప్రజా ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట

పెంబి, వెలుగు: పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. మంగళవారం పెంబి మండల కేంద్రంలో రూ.1.50 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొత్త భవనంతో పాటు రూ.1.20 కోట్లతో నిర్మించిన జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల అదనపు గదులను ఎమ్మెల్యే బొజ్జు పటేల్, కలెక్టర్ అభిలాష అభినవ్​తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్ 

మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని, ప్రజలకు  అందుబాటులో ఉండి సేవలు అందించాలని  డాక్టర్లకు సూచించారు. కొత్తగా ఏర్పడిన పెంబి మండలంలో విద్య, వైద్యం, రవాణా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డీఎంహెచ్ వో డాక్టర్ రాజేందర్, డీఈవో రవీందర్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ ఈఈ శంకరయ్య, తహసీల్దార్ లక్ష్మణ్, ఎంపీడీఓ రమాకాంత్, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ సత్యం, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సల్ల స్వప్నిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.