రైతు సమస్యలపై సీఎంకు వినతి :ఎమెల్యే పాయల్‌ శంకర్‌

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్‌ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వేలాది ఎకరాలు నీట మునిగి అపార నష్టం వాటిల్లిం దని, వరద ముంపు బాధిత రైతులను ఆదుకోవాలని అదిలాబాద్‌ ఎమెల్యే పాయల్‌ శంకర్‌ సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసి కోరారు. సోమవారం హైదరాబాద్‌లో సీఎంను కలిసిన పాయల్‌ శంకర్‌ ఆదిలాబాద్‌ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.  వినతిపత్రం అందించారు.

పెన్‌గంగా నదీ పరివాహక ప్రాంతంలో వరదల వల్ల పత్తి, సోయాబీన్, కంది పంటలు నీట మునిగి రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. జిల్లాలో నష్టంపై వెంటనే అంచనాలు రూపొందించి రైతులకు నష్ట పరిహారం అందించాలని, ఫసల్‌ బీమా యోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. రైతు సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్టు ఎమ్మెల్యే తెలిపారు.