ఖైదీలకు సైకాలజిస్టులతో కౌన్సిలింగ్ : మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరేళ్ల శారద 

ఆదిలాబాద్, వెలుగు: జైలులో ఖైదీల మానసిక పరిస్థితి మెరుగుపరిచేందుకు త్వరలో సైకాలజిస్టులతో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరేళ్ల శారద తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా గురువారం కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ఆమె జిల్లా జైలును సందర్శించారు.

మహిళా ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఖైదీలకు అందించే మెనూ, తీసుకుంటున్న జాగ్రత్తలు, జైలులో పాటిస్తున్న పరిశుభ్రత, భద్రత అంశాలపై ఆరా తీశారు. అనంతరం జైలులో నిర్వహించిన మెడికల్ క్యాంప్ లో పాల్గొని ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. పండ్లు, క్యారంబోర్డ్, చెస్ బోర్డ్ అందించారు. ఆమె వెంట అడిషనల్ కలెక్టర్ శ్యామలా దేవి,  మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీబాయి తదితరులు ఉన్నారు. 

చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి

చట్టాల పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ అన్నారు. కలెక్టరేట్​లో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. అదిలాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి పథకాలు అందరికీ అందేలా ఆయా శాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు. గంజాయిని అరికట్టాలని, మత్తు పదార్థాలపై అవగాహన కల్పించాలని సూచించారు.