ఆరోగ్య పాఠశాలలుగా తీర్చిదిద్దాలి : రాజర్షి షా

  • కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, వెలుగు: జిల్లాల్లోని అన్ని హైస్కూళ్లను ఆరోగ్య పాఠశాలలుగా మార్చే బాధ్యత అందరిపై ఉందని ఆదిలాబాద్ ​కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం రిమ్స్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పాఠశాలల్లో విద్యార్థులు వ్యాధుల బారిన పడకుండా, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసేందుకు, వారిలో ఆత్మ విశ్వాసం, సామాజిక నైపుణ్యాలు పెంపొందించేందుకు ఈ కార్యక్రమం రూపొందించినట్లు చెప్పారు. నవంబర్ 14 నుంచి అన్ని హైస్కూళ్లు, కేజీబీవీ, ఇంటర్ కాలేజీల్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. 

నాలుగు వారాల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రతి సోమవారం వ్యక్తిగత పరిశుభ్రత, మంగళవారం పోషకాహారంపై అవగాహన, బుధవారం ఒత్తిడి నివారించుకునే మార్గాలు, గురువారం డ్రగ్స్​కు దూరంగా ఉండడం, శుక్రవారం కాలానుగున వ్యాధుల నివారణ, శనివారం వ్యక్తిత్వ వికాసం ఈ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్, డీఎంహెచ్​వో నరేందర్ రాథోడ్, డీఈవో ప్రణీత, జిల్లా సంక్షేమ అధికారి సబిత, స్త్రీ శిశు సంక్షేమ అధికారి మిల్కా, ఇంటర్ విద్యాశాఖ అధికారి రవీందర్ పాల్గొన్నారు.