నిర్మల్, వెలుగు: విద్యార్థులు శాస్త్రీయ దృక్పథంపై మరింత అవగాహన పెంపొందించుకోవాలని అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సూచించారు. నిర్మల్పట్టణంలోని సెయింట్ థామస్ హై స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ శనివారం ముగియగా.. కార్యక్రమానికి ఆయన చీఫ్‌గెస్ట్‌గా హాజరై మాట్లాడారు.
రోజురోజుకు శాస్త్ర సాంకేతిక రంగాలు వేగంగా విస్తరిస్తున్నాయని, దీనికనుగుణంగా విద్యాబోధనలోనూ శాస్త్రీయ దృక్పథం విస్తరించాలన్నారు. విద్యార్థులు సైంటిస్టులుగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. సైన్స్ ఫెయిర్ లతో విజ్ఞానం మరింత విస్తరిస్తుందని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న మేధోశక్తిని వెలికి తీయాల్సిన బాధ్యత టీచర్లపై ఉందన్నారు.
సృజనాత్మకతను పెంపొందించాలి
విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేలా ఎగ్జిబిట్లను తయారు చేయాలని జాతీయ సైన్స్ ఫెయిర్ పరిశీలకుడు, గౌహతి ఐఐటీ ప్రొఫెసర్ పెంటు హతి అన్నారు. కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ విద్య వైజ్ఞానిక ప్రదర్శనలకు జాతీయస్థాయిలో మంచి ప్రోత్సాహం ఉందన్నారు. విద్యార్థుల్లో ఆలోచనా దృక్పథం పెంపొందించేలా వారిని తయారుచేయా లని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు, ఉపాధ్యాయ సంఘాల నేతలు, వివిధ కమిటీల సభ్యులు పాల్గొన్నారు.