ప్రతి దాడి మరింత స్ట్రాంగ్ చేస్తోంది: అమెరికా ఆరోపణలపై స్పందించిన అదానీ

జైపూర్: అదానీ గ్రీన్ ఎనర్జీ కాంట్రాక్టుల కోసం ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ అధికారులకు లంచాలు ఇవ్వజూపారన్న అభియోగాలపై అమెరికాలో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా ఆరోపణలపై ప్రముఖ వ్యాపార వేత్త, బిలియనీర్ గౌతమ్ అదానీ స్పందించారు. శనివారం (నవంబర్ 30) రాజస్థాన్ లో జరిగిన ఓ కార్యక్రమానికి అదానీ చీఫ్ గెస్ట్‎గా వెళ్లారు. ఈ కార్యక్రమంలో అదానీ అమెరికా ఆరోపణలపై రెస్పాండ్ అయ్యారు. అదానీ గ్రూప్‎పై అమెరికా చేసిన ఆరోపణలు తమకు కొత్త కాదని.. ఇలాంటి తరహా ఆరోపణలు మేం గతంలో కూడా చాలా ఎదుర్కొన్నామని తెలిపారు.

‘‘మేము ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటివి చాలా ఫేస్ చేశాం. కానీ నేను మీకు చెప్పగలను తమ కంపెనీపై ఇలాంటి ప్రతి దాడి మమ్మల్ని మరింత బలపరుస్తుంది. ప్రతి అవరోధం అదానీ గ్రూప్ మరింత దృఢంగా అయ్యేందుకు సోపానం అవుతుంది.  అదానీ గ్రూప్‌ ఎన్నో విజయాలు సాధించినప్పటికీ ఎదుర్కొన్న సవాళ్లు మరింత పెద్దవి. ఈ సవాళ్లు మమ్మల్ని విచ్ఛిన్నం చేయలేదు. అవి మమ్మల్ని మరింత కఠినతరం చేశాయి.  ప్రతి పతనం తర్వాత మనం మళ్లీ పైకి లేస్తామనే అచంచలమైన నమ్మకాన్ని అందించాయి’’ అని వ్యాఖ్యానించారు అదానీ. 

ALSO READ | ట్రంప్ కూర్చి ఎక్కకముందే.. రండీ : భారతీయ విద్యార్థులకు అమెరికా అడ్వైస్

అదానీ గ్రూప్‎పై చాలా ఆరోపణలు వచ్చినప్పటికీ ఎవరూ ఎఫ్సీపీఏ ఉల్లంఘన లేదా న్యాయాన్ని అడ్డుకునే కుట్రకు పాల్పడినట్లు అభియోగాలు మోపబడలేదని నొక్కి చెప్పారు. ప్రస్తుత ప్రపంచంలో వాస్తవాల కంటే అబద్ధాలే వేగంగా వ్యాపిస్తోందన్నారు. షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ ఆరోపణలను కూడా ఈ సందర్భంగా అదానీ గుర్తు చేసుకున్నారు. అమెరికా ఆరోపణల తరహాలోనే గతంలో తమపై హిండెన్ బర్గ్ ఎలిగేషన్స్ చేసింది. 

చివరకు అవన్నీ తప్పుడు ఆరోపణలన్నీ తేలిందన్నారు. హిండెన్ బర్గ్ రిపోర్ట్ వల్ల అదానీ గ్రూప్ చాలా ఇబ్బంది పడ్డప్పటికీ తిరిగి అంతే వేగంగా పుంజుకుందని తెలిపారు. అంతేకాకుండా మా ఆల్-టైమ్ రికార్డ్ ఆర్థిక ఫలితాలు మా నిబద్ధతను ప్రదర్శించాయని పేర్కొన్నారు. ఏ ఒక్క భారతీయ లేదా విదేశీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కూడా మమ్మల్ని డౌన్‌గ్రేడ్ చేయలేదని.. చివరకు తమపై వచ్చిన ఆరోపణలను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా తోసిపుచ్చిందన్నారు.