FMCG బిజినెస్ అమ్మేస్తున్నాం: అదానీ గ్రూప్ కీలక ప్రకటన

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ ఎఫ్‌‌‌‌ఎంసీజీ బిజినెస్‌‌‌‌ నుంచి ఎగ్జిట్‌‌‌‌ అవ్వాలని నిర్ణయించుకుంది. సింగపూర్ కంపెనీ విల్‌‌‌‌మార్‌‌‌‌‌‌‌‌తో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్‌‌‌‌‌‌‌‌లో తన  వాటాలను విక్రయించనుంది. 43.94 శాతం వాటాలను అమ్మి, సుమారు 2 బిలియన్ డాలర్ల (రూ.17 వేల కోట్ల)ను అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌ సేకరించనుంది. ఫార్చ్యూన్ బ్రాండ్‌‌‌‌ వంట నూనెను అదానీ విల్‌‌‌‌మార్‌‌‌‌‌‌‌‌ అమ్ముతోంది. ఈ కంపెనీలో 31.06 శాతం వాటాను రూ.12,314 కోట్లకు విల్‌‌‌‌మార్ ఇంటర్నేషనల్‌‌‌‌కు అమ్మనుండగా, సుమారు 13 శాతం వాటాను ఓపెన్ మార్కెట్‌‌‌‌లో విక్రయించనుంది. ఒక్కో షేరుని రూ.305 కంటే ఎక్కువకు అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌ సేల్ చేయనుంది.  

‘అదానీ విల్‌‌‌‌మార్ నుంచి అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌ పూర్తిగా ఎగ్జిట్‌‌‌‌ కానుండడంతో, ఈ కంపెనీ బోర్డు నుంచి అదానీ గ్రూప్‌‌‌‌ నామినేట్ చేసిన డైరెక్టర్లు దిగిపోతారు’ అని అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ ఎక్స్చేంజ్‌‌‌‌ ఫైలింగ్‌‌‌‌లో పేర్కొంది. ఈ వాటాల అమ్మకం  మార్చి 31, 2025 లోపు పూర్తవుతుందని అంచనా. అదానీ విల్‌‌‌‌మార్‌‌‌‌‌‌‌‌లోని వాటాలను అమ్మడం ద్వారా సేకరించిన ఫండ్స్‌‌‌‌ను అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ కీలక వ్యాపారాలను విస్తరించడానికి వాడనున్నారు. 

అదానీ గ్రూప్ ఫ్లాగ్‌‌‌‌షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌ కింద ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్స్‌‌‌‌, కోల్‌‌‌‌, రోడ్డు కన్‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌, గ్రీన్ హైడ్రోజన్, కాపర్ వంటి వివిధ బిజినెస్‌‌‌‌లు ఉన్నాయి.  అదానీ విల్‌మార్‌‌‌‌‌‌‌‌లో అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌కు, విల్‌‌‌‌మార్ ఇంటర్నేషనల్‌‌‌‌కు కలిపి 87.87 శాతం వాటా ఉంది. రూల్స్ ప్రకారం, ఈ వాటా 75 శాతం దిగువకు రావాలి. అందుకే 13 శాతం వాటాను ఓపెన్ మార్కెట్‌‌‌‌లో విక్రయించాలని అదానీ గ్రూప్  నిర్ణయించుకుంది. గౌతమ్‌ అదానీపై యూఎస్‌‌‌‌లో లంచం కేసు ఫైల్ అయిన తర్వాత కంపెనీ తీసుకున్న  మొదటి పెద్ద నిర్ణయం ఇది.