టీచర్లపై లాఠీ ఛార్జ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

  •     టీచర్లపై  సస్పెన్షన్లను ఎత్తివేయాలి

సంగారెడ్డి టౌన్ ,వెలుగు: నారాయణఖేడ్ లో రెమ్యూనరేషన్ అడిగిన టీచర్లపై  లాఠీచార్జి చేయించిన ఆర్డీఓ , సీఐ, ఎస్​ఐ  పై  చర్యలు తీసుకోవాలని జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్లో డీఆర్ఓ పద్మజ రాణికి అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు జ్ఞాన మంజరి, సాయిలు ,నాగారం శ్రీనివాస్, సయ్యద్ అలీ , అనుముల రామచందర్ మాట్లాడుతూ   ఎన్నికల్లో  విధులు నిర్వహించిన టీచర్లకు  ఇతర జిల్లాలతో సమానంగా రెమ్యూనరేషన్ చెల్లించాలని కోరగా వారిపై  లాఠీచార్జి చేయడం  హేయమైన చర్య అన్నారు.  

కనీస వసతులు లేకపోయినా తీవ్రమైన ఎండల్లో ఎన్నికలను విజయవంతం చేశామన్నారు.  న్యాయబద్ధంగా రావాల్సిన  ఒకరోజు రెమ్యూనరేషన్ అడిగినందుకు ఉపాధ్యాయులపై లాఠీ చార్జి చేయడం ఏంటని ప్రశ్నించారు.  లాఠీచార్జికి బాధ్యులైన నారాయణఖేడ్ ఆర్డీఓ, సీఐ, ఎస్​ఐ పై చర్యలు తీసుకోవాలని,  సస్పెండ్ చేసిన టీచర్లను  తిరిగి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్​ చేశారు.  ఈ కార్యక్రమంలో   ఉపాధ్యాయ సంఘాల నాయకులు సుభాన్​సింగ్​, దుర్గమ్య, సుభాన్​సింగ్​ , లక్ష్మయ్య  పాల్గొన్నారు.