న్యూఢిల్లీ: ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ ద్వారా ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేయాలనుకునే కస్టమర్లు ఎవరికి పంపుతున్నారో వారి అకౌంట్ పేరును ముందుగానే వెరిఫై చేసుకునే సౌదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్‌పీసీఐ)ను ఆర్‌బీఐ కోరింది. ట్రాన్సాక్షన్‌కు ముందు బ్యాంక్ అకౌంట్ పేరును వెరిఫై చేసుకుంటే పొరపాట్లను నివారించొచ్చని తెలిపింది.
రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టీజీఎస్), నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్) మెంబర్లు లేదా సబ్ మెంబర్లు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 లోపు ఈ ఫెసిలిటీని అందించాలని ఆదేశించింది. ప్రస్తుతం యూపీఐ, ఇమీడియేట్ పేమెంట్స్ సర్వీస్ (ఐఎంపీఎస్) ట్రాన్సాక్షన్లకు ముందు అకౌంట్ పేరును వెరిఫై చేసుకునేందుకు వీలుంది.
12 ఏళ్ల కనిష్టానికి మొండిబాకీలు..
బ్యాంకుల మొండిబాకీలు 12 ఏళ్ల కనిష్టానికి దిగొచ్చాయని ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ (డిసెంబర్)లో ఆర్‌బీఐ పేర్కొంది. గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (జీఎన్‌పీఏ) ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 2.6 శాతానికి మెరుగుపడిందని తెలిపింది. కానీ, బ్యాంకులు, ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకులు లోన్లను రైటాఫ్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాంకులిచ్చిన నికర అప్పులు, నెట్ ఎన్‌పీఏల రేషియో 0.6 శాతానికి మెరుగుపడింది. 2025లో వినియోగం పుంజుకుంటుందని, ఎకానమీ మెరుగుపడుతుందని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు.