ఆశ్రమ పాఠశాలలో ఏసీబీ తనిఖీలు

బెల్లంపల్లి రూరల్, వెలుగు: మంచిర్యాల జిల్లా వేమనపల్లి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఏసీబీ ఆకస్మిక తనిఖీలు కలకలం సృష్టించాయి. ఆదిలాబాద్ ​జిల్లా ఇన్​చార్జి డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో 8 గంటల పాటు అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణ, బాత్రూంలు సరిగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టూడెంట్స్​ హాజరులో రిజిస్టర్​లో ఉన్న విద్యార్థుల సంఖ్యకు తరగతి గదుల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యకు పొంతన లేనట్లు గుర్తించారు. వారి వివరాలు హెచ్ఎం జ్ఞానేశ్వర్​ను అడిగి తెలుసుకున్నారు. 

270 మంది విద్యార్థులకు గానూ 130 మంది విద్యార్థులు హాజరైనట్లు హాజరు పట్టికలో పేర్కొన్నారు. కానీ 130 మంది విద్యార్థులు పాఠశాలలో లేరని, హాజరు పట్టికకు విద్యార్థుల సంఖ్యకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. స్టాక్ ​రిజిస్టర్​ను సరుకులతో పోల్చి చూశారు. సేకరించిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు నివేదిక రూపంలో పంపనున్నట్లు చెప్పారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగిన తనిఖీలు జిల్లాలో హాట్​టాపిక్​గా మారాయి.