- గాలింపు చర్యలు పరిశీలించిన ఎస్పీ
జైనథ్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని పెన్ గంగా నదిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఆదిలాబాద్ మండలం చాందాటికి చెందిన కొంతం శివ(23) మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆదివారం సాయంత్రం పెన్ గంగా నది వద్దకు వెళ్లారు. నది ఒడ్డు వరకు వెళ్లి తొంగి చూస్తుండడంతో ప్రమాదవశాత్తూ కాలు జారి అందులో పడిపోయాడు. భయపడిన మిగతా స్నేహితులు రాత్రి పోలీసులకు సమాచారమిచ్చారు.
పోలీసులు అర్ధరాత్రి ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ వరద ప్రవాహం ఉండడంతో సోమవారం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రస్తుతంగా డీడీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. ఎస్పీ గౌస్ ఆలం సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సీఐ సాయినాథ్, ఎస్సై పురుషోత్తం పర్యవేక్షిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో యువకుడి ఆచూకీ దొరకడం లేదు.