నర్సాపూర్ : నర్సాపూర్‌లో సంచలనం రేపిన జంట హత్యల మిస్టరీ వీడింది. నగలు, డబ్బు కోసం కొడుకే తల్లిదండ్రులను హత్య చేసి, పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు సీఐ జాన్‌రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సాదుల్లానగర్‌కు చెందిన చాకలి కిష్టయ్య (75), నర్సమ్మ(70)కు చెందిన భూమిని అమ్మి పిల్లలకు రూ. 4 లక్షల చొప్పున ఇచ్చారు. చిన్న కొడుకు లక్ష్మణ్ జల్సాలకు అలవాటుపడడంతో పాటు, కారు ఫైనాన్స్ కోసం డబ్బులను వాడేసుకున్నాడు.
ఇంకా డబ్బులు కావాలని తల్లిదండ్రులను అడగడంతో వారు లేవని చెప్పారు. మే 17న సాదుల్లానగర్‌కు వచ్చిన లక్ష్మణ్ 18న తల్లిదండ్రులను తాను ఉంటున్న బొంతపల్లికి తీసుకెళ్లాడు. 19వ తేదీన మరోసారి డబ్బులు అడుగగా వారు ఒప్పుకోకపోవడంతో గొడవ జరిగింది. అదే రోజు రాత్రి నర్సమ్మ, కిష్టయ్యను లక్ష్మణ్ గొంతు నులిమి హత్య చేశాడు. తర్వాత తన కారులో నర్సాపూర్‌లోని రాయరావు చెరువు కట్ట వద్దకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టాడు. నర్సాపూర్‌లో మృతదేహాలు దొరికినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో అనుమానం వచ్చిన బంధువులు లక్ష్మణ్‌ను నిలదీయగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో లక్ష్మణ్‌ను అదుపులోకి తీసుకున్నారు.