ఆస్తి కోసం మామను చంపిన అల్లుడు

  • సహకరించిన అత్త

బోధన్‌‌‌‌, వెలుగు: ఆస్తి కోసం ఓ వ్యక్తి అత్తతో కలిసి మామను హత్య చేశాడు. అనంతరం సాధారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేయగా, అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. ఈ ఘటన బోధన్‌‌‌‌ పట్టణంలో ఆదివారం వెలుగుచూసింది. బోధన్‌‌‌‌ సీఐ వెంకట్‌‌‌‌నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్‌‌‌‌కు చెందిన క్యామొళ్ల శంకర్‌‌‌‌ (50) తన పెద్దకూతురికి చెక్కి క్యాంప్‌‌‌‌ గ్రామానికి చెందిన కుర్మ రవితో ఐదేండ్ల కింద పెండ్లి చేసి ఇల్లరికం తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి రవి బోధన్‌‌‌‌లో అత్తామామలతో కలిసే ఉంటున్నాడు. శంకర్‌‌‌‌కు గొర్రెల మంద, కొట్టం ఉండగా ఇటీవల ప్లాట్‌‌‌‌ కొనుగోలు చేశాడు. వాటిని దక్కించుకునేందుకు రవి మామ శంకర్‌‌‌‌ను హత్య చేసేందుకు ప్లాన్‌‌‌‌ చేశాడు. 

అత్తామామల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో శంకర్‌‌‌‌ను హత్య చేసేందుకు అత్త చిన్నమ్మను కూడా ఒప్పించాడు. శనివారం రాత్రి శంకర్‌‌‌‌ తన కొట్టంలో పడుకొని ఉండగా రవి అత్త చిన్నమ్మతో కలిసి వెళ్లాడు. చిన్నమ్మ శంకర్‌‌‌‌ కాళ్లు పట్టుకోగా, మర్మాంగాలు, ఛాతిపై రవి గట్టిగా తన్నడంతో అక్కడికక్కడే చనిపోయాడు. తర్వాత డెడ్‌‌‌‌బాడీని ఇంటికి తీసుకొచ్చి ఊపిరాడక శంకర్‌‌‌‌ చనిపోయినట్లు స్థానికులు, బంధువులను నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే ఒంటిపై గాయాలు కనిపించడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి రవి, చిన్నమ్మను అదుపులోకి తీసుకొని విచారించగా తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. ఘటనాస్థలాన్ని సీఐ వెంకటనారాయణ పరిశీలించారు.