రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని కాపాడబోయి వ్యక్తి మృతి

దుబ్బాక, వెలుగు : సిద్దిపేట జిల్లా అక్బర్​పేట భూంపల్లి మండలం చిట్టాపూర్​లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని కాపాడబోయిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం రాత్రి రామాయంపేట నుంచి సిద్దిపేటకు వెళ్తున్న కారు చిట్టాపూర్​లోని ఇర్కోటి రామాగౌడ్ ​ఇంటి ముందున్న డివైడర్​ను ఢీకొని బోల్తా పడింది. అప్పుడు అక్కడే ఉన్న రామాగౌడ్, తన మనవడైన  అరవింద్​తతో కలిసి కారు డోర్లను తీసి అందులో పిల్లలు అమూల్య, సిరి చందనను బయటకు లాగాడు.

అప్పుడే సిద్దిపేటకు అతివేగంగా వెళ్తున్న ఆటో వీరిని ఢీకొట్టడంతో రామాగౌడ్​ అక్కడికక్కడే చనిపోగా అమూల్య, సిరి చందన, అరవింద్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు దుబ్బాక ఏరియా హాస్పిటల్​కు తరలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు భూంపల్లి ఎస్ఐ హరీశ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.