లోన్ పేరుతో ఆన్​లైన్​ మోసం

  • దహెగాం వ్యక్తికి రూ.31 వేల టోకరా
  • సైబర్ ​క్రైం పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

దహెగాం, వెలుగు: ఓ వ్యక్తికి రూ.8 లక్షల లోన్​ఆశ చూపి సైబర్ ​మోసగాళ్లు నిండా ముంచారు. ఆసిఫాబాద్​ జిల్లా దహెగాం ఎస్​ఐ కందూరి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బ్రాహ్మణ చిచ్చాల గ్రామానికి  చెందిన దేశ్ ముకుల సంజీవ్ ఇటీవల యూట్యూబ్ లో వీడియోలు చూస్తుండగా ధని ఫైనాన్స్ యాడ్ వచ్చింది. లింక్​పై క్లిక్ చేసి రూ.8 లక్షల లోన్ కోసం అప్లై చేశాడు. రెండో రోజు ఫైనాన్స్​ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని ​అతడికి ఓ కాల్ వచ్చింది.

డాక్యుమెంట్ చార్జీలకు రూ.6550 ఫోన్​పే చెయ్యాలని చెప్పడంతో సంజీవ్ ఆ డబ్బులు పంపించాడు. అరగంట తర్వాత అదే నంబర్ ​నుంచి మళ్లీ కాల్ చేసి తాము లోన్ డబ్బులు పంపామని అకౌంట్ చెక్ చేసుకోవాలని చెప్పారు. అకౌంట్ చెక్ చేసుకొని సంజీవ్ డబ్బులు రాకపోవడంతో విషయాన్ని వారికి చెప్పాడు. ఫస్ట్ ఇన్​స్టాల్ మెంట్ రూ.24,698 కడితే డబ్బులు మీ అకౌంట్​లో పడతాయని సమాధానం వచ్చింది.

దీంతో సంజీవ్ ఆ డబ్బులను కూడా పంపాడు. అయినా ​లోన్ ​డబ్బులు జమ కాకపోవడంతో ఫోన్ చెయ్యగా.. ఎక్కువ అమౌంట్ కదా ఇంకో ఇన్​స్టాల్​మెంట్ కూడా కట్టాలని చెప్పడంతో.. సంజీవ్​కు అనుమానం వచ్చి లోన్ వద్దని, తన డబ్బులు తనకు పంపాలని కోరాడు. కానీ మరో రూ.4 వేలు కడితేనే నీ డబ్బులు నీకు వస్తాయని చెప్పడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి కాల్ చేసి కంప్లైంట్ చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్​ఐ తెలిపారు.