కౌడిపల్లి, వెలుగు : ఇండ్లకు వెళ్లేందుకు దారి ఇవ్వడం లేదని, ఈ విషయంలో ఎంతగా తిరుగుతున్నా తమకు న్యాయం జరగడం లేదని రెండు కుటుంబాలకు చెందిన వారు పోలీస్ స్టేషన్ లోనే ఆత్మహత్యాయత్నం చేశారు. బాధితుల కథనం ప్రకారం... మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం నాగ్సాన్ పల్లికి చెందిన అల్మాయిపేట లక్ష్మయ్య, అల్మాయిపేట రాజయ్య, అల్మాయిపేట మాణయ్య, అల్మాయిపేట శ్రీశైలం.. చిన్నాన్న, పెద్దనాన్న కొడుకులు. వీరికి సర్వే నంబర్148లో 60 గుంటల భూమి ఉంది. గ్రామ కంఠంలో ఉండగా 20 గుంటలు స్కూల్‌కు ఇచ్చారు. మిగిలిన 40 గుంటలు సమానంగా పంచుకోవాలని అనుకోగా, ఈ విషయంలో వీరి మధ్య కొన్నేండ్లుగా గొడవలు జరుగుతున్నాయి. అయితే, దారి విషయంలో తమకు న్యాయం జరగడం లేదంటూ అల్మాయిపేట లక్ష్మయ్య, అల్మాయిపేట రాజయ్య కుటుంబసభ్యులు బుధవారం రాత్రి డీజిల్ బాటిళ్లతో కౌడిపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చి హల్ చల్ చేశారు.
తమ ఇండ్ల ముందు నుంచి వెళ్లడానికి దారి ఇవ్వడం లేదంటూ పోలీసుల ముందే ఒంటిపై డీజిల్ పోసుకున్నారు. దీంతో పోలీసులు అడ్డుకుని బయటకు పంపించారు. దీంతో వారు నేషనల్ హైవేపై అరగంట పాటు ధర్నాకు దిగారు. బాధితులు మాట్లాడుతూ బుధవారం మధ్యాహ్నం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తమ ఇండ్ల ముందు దారికోసం మట్టి పోసుకుంటామని అడిగితే పోలీసులు సరే అన్నారని, ఆ తర్వాత అదే రోజు సాయంత్రం ఫోన్‌చేసి కోర్టు నుంచి స్టే ఆర్డర్ ఉందని, పనులు చేయొద్దని చెప్పారని ఆరోపించారు. సంవత్సరం నుంచి ఇదే సమస్య ఉందని, కనీసం తమ ఆత్మహత్యలతోనైనా ఇండ్ల ముందు దారి ఇస్తే తమ పిల్లలైనా బతుకుతారేమో అని ఆత్మహత్యాయత్నం చేశామని బాధితులు తెలిపారు. పోలీసులు అడ్డుకొని ఎన్నికల కోడ్ ఉన్నందున ఎలాంటి ధర్నాలు చేయొద్దని నచ్చజెప్పడంతో ఇంటికి వెళ్లిపోయారు.