సీఎం రాకతో కాంగ్రెస్​లో జోష్

  • కార్నర్ మీటింగ్ కు భారీగా జనం హాజరు 
  • కేసీఆర్​, హరీశ్ టార్గెట్ గా ప్రసంగాలు 

సిద్దిపేట టౌన్, రూరల్, వెలుగు : మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా గురువారం సిద్దిపేటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ కు సీఎం హాజరుకావడంతో పార్టీ శ్రేణుల్లో జోష్​ నెలకొంది. సాయంత్రం 6 గంటలకు  హెలికాప్టర్ లో సిద్దిపేట చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బీజేఆర్​చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు నిర్వహించిన రోడ్ షోలో పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అరగంట పాటు సాగిన రోడ్ షో సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తో పాటు జిల్లా ఇన్​చార్జి మంత్రి కొండా సురేఖ, మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ప్రజలకు అభివాదం చేస్తూ వచ్చారు. 

నాయకుల ప్రసంగాలు ..

ఈ సందర్భంగా మంత్రి  కొండా సురేఖ మాట్లాడుతూ కాంగ్రెస్ మీటింగ్ కు వచ్చిన ప్రజలను చూసి హరీశ్ రావు నిద్రపోడని, ఇన్ని రోజులు సిద్దిపేట అంటే తన అడ్డా అని విర్రవీగిన ఆయన అధికారం పోతే ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తున్నాడన్నారు. జనం బానిస సంకెళ్లను తెంచుకుని బయటకు వచ్చారని పేర్కొన్నారు. అంతకు ముందు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ సిద్దిపేట జనప్రవాహంతో నిండిపోయిందని, నీలం మధు గెలుపు ఖాయంగా కనిపిస్తోందన్నారు. పీఎం మోదీ దేశ వ్యాప్తంగా గ్యాస్ రేట్ పెంచితే, రేవంత్ ఇక్కడ రూ.500 లకే సిలిండర్ అందిచడంతో పాటు

 మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించాడన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దేశం ఇంకా అభివృద్ధి చెందుతుందన్నారు. ఎంపీ అభ్యర్థి నీలం మధు మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఇక్కడి నుంచి గెలుపొంది ప్రధాన మంత్రి అయిందని, ఈ స్థానం నుంచి తాను పోటీ చేయడం సంతోషంగా ఉందన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన తనకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ కు, సీఎం రేవంత్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు.